Odisha school: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలోని సలాగూడలో ఉన్న సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. హాస్టల్ లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. ఈ ఘటన సెప్టెంబర్ 11, 2025 రాత్రి ఫిరింగియా బ్లాక్‌లోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్‌లో జరిగింది.
సెబాశ్రమ్ స్కూల్‌లో చదువుతున్న 3, 4, 5 తరగతులకు చెందిన 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో, ఒక విద్యార్థి ఫెవిక్విక్ జిగురును వారి కళ్లలో పోశాడు. ఉదయం నీటితో కళ్లు కడుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు, ఈ ఎనిమిది మంది విద్యార్థులు తమ కళ్లు తెరవలేకపోయారు. ఈ విషయం గుర్తించిన ఉపాధ్యాయురాలు ప్రేమలత సాహూ, వెంటనే విద్యార్థులను గోచ్ఛపాడ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఒక విద్యార్థి కళ్లు తెరవగలిగినప్పటికీ, మిగిలిన ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం ఫుల్బని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక విద్యార్థి యొక్క పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అతన్ని MKCG మెడికల్ కాలేజీకి బదిలీ చేశారు.
వైద్యుల వివరాల ప్రకారం, ఫెవిక్విక్ వల్ల కళ్లకు ఎక్కువ నష్టం జరిగినప్పటికీ, సకాలంలో వైద్య సహాయం అందడంతో శాశ్వత దృష్టి నష్టం నివారించబడింది. ప్రస్తుతం విద్యార్థులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు.. వారి ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. కంధమాల్ జిల్లా వెల్ఫేర్ అధికారి ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులకు సరైన చికిత్స అందుతుందని నిర్ధారించారు.
ఈ ఘటనపై కంధమాల్ జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించారు. స్కూల్ హెడ్‌మాస్టర్ మనోరంజన్ సాహూను నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేశారు. హాస్టల్ సిబ్బంది, వార్డెన్‌ల నిర్లక్ష్యంపై దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దోషులను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. స్థానిక సర్పంచ్ రోహిత్ కహన్రా, ఉపాధ్యాయులు, సిబ్బంది హాస్టల్‌ను సరిగా పర్యవేక్షించడం లేదని ఆరోపించారు.
Also Read: ఏపీని షేక్ చేస్తున్న ఐఏఎస్ గిరిషా.. అసలు కథ ఇదే..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. తల్లిదండ్రులు, స్థానిక నాయకులు హాస్టల్‌లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఆశ్రమ స్కూళ్లలో పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కూడా కంధమాల్ జిల్లాలోని ఆశ్రమ స్కూళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఘటనకు కారణమైన విద్యార్థిపై తగిన చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు.