Ram Mandir : మరికొన్ని గంటల్లో అయోధ్య రామాలయంలో బాలరాముడు కొలువుదీరబోతున్న వేళ.. దేశ, విదేశాల నుంచి ఎవరికి వారు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఫిలిభిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కూడా ఒక అరుదైన కానుకను రామయ్యను పంపింది.
ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్ అహ్మద్, తన భార్య హీనా ఫర్వీన్, కుమారుడి, మరికొందరు మిత్రులతో కలిసి రూపొందించిన 21.6 అడుగుల పొడవైన ఓ భారీ వేణువును వారు రామయ్యకు కానుకగా పంపనున్నారు. ఈమేరకు దానిని అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నవాబ్ కుటుంబం దశాబ్దాల కాలంగా వేణువుల తయారీలో ఉంది. 2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేయగా, అప్పట్లో అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తాజాగా దానికంటే పెద్దదైన 21.6 అడుగుల వేణువును వీరు తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలువనున్నది. జనవరి 26న ఈ వేణువును అయోధ్య ఆలయానికి తరలించనున్నారు.
ఈ వేణువు వ్యాసం 3.5 అంగుళాలు. ఈ వేణువును తయారు చేయడానికి పది రోజులు పట్టిందని, దీనిని రెండు వైపుల నుంచీ వాయించవచ్చని నవాబ్ కుటుంబం తెలిపింది. దీని తయారీకి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయింది. దీనిని ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక ట్రక్కులో ఊరేగింపులా తరలివెళ్లి, దీనిని రామయ్యకు సమర్పించనున్నట్లు నవాబ్ తెలిపారు.
ఈ భారీ వేణువును అసోంకు చెందిన వెదురుతో చేశారు. 20 ఏళ్ల క్రితమే సేకరించిన వెదురుతో దీనిని తయారు చేశామని, ప్రస్తుతం ఈ రకం వెదురు ఇంకెక్కడా అందుబాటులో లేదని, వేరే అవసరం కోసం ఏనాడో సేకరించిన ఈ అరుదైన వెదురు.. రామయ్యకు బహుమతిగా మారి ఆలయంలో కొలువు తీరుతుందని తాము ఏనాడూ అనుకోలేదని నవాబ్ అహ్మద్ కుటుంబం సంతోషం వెలిబుచ్చింది.