Adani Group: సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం లంచం ఇవ్వడానికి చూశారంటూ అమెరికా ప్రాసిక్యూటర్స్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్స్ ఖండిచింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని అభిప్రాయపడింది. చట్టాలకు లోబడే తమ గ్రూప్ నడుచుకుంటుందని పేర్కొంది. న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది. దోషులుగా తేలే వరకు నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. పాలనా వ్యవహారాల్లో, పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్స్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోందని తెలిపారు.
Also read: అదానీ దేశసంపద కొల్లగొట్టాడు.. ఆయన వెనకుంది మోడీనే: రాహుల్ గాంధీ
తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతిచోటా దీనిని పాటిస్తామని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి వ్యవహరిస్తూ వాటిని గౌరవిస్తామని, పెట్టుబడిదారులు, వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూప్ రూ.2.100 కోట్లు లంచం ఇవ్వాలనుకున్నారని, దీని గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణలు చేశారు.
దీంతో గౌతమ్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఈ దెబ్బతో అదానీ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. మరోవైపు రాజకీయాల్లోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అదానీ గ్రూప్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంతో బీజేపీపై నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశంలో ప్రధాని అండతో అదానీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.