
Parliament latest news today(Breaking news of today in India) :
లోక్ సభ ఎన్నికలు ముందే జరుగుతాయనే ప్రచారం మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యపడకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇదేనని తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12న ముగిశాయి. శీతాకాల సమావేశాలు డిసెంబర్ జరగాల్సి ఉండగా .. ఇప్పుడు ప్రత్యేక సమావేశాల ఏర్పాటుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీని అమలు చేయడానికి 2017 జూన్ 30న పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ప్రత్యేకంగా అర్ధరాత్రి సమయంలో నిర్వహించారు. గతంలో స్వాతంత్య్ర రజతోత్సవాలు, క్విట్ ఇండియా 50వ వార్షికోత్సవం సమయంలో మాత్రమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈసారి మాత్రం పూర్తిస్థాయి సమావేశాల తరహాలోనే 5 రోజులపాటు జరగనున్నాయి. అయితే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజు తర్వాత రోజు ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానుండటం ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనేక కీలక బిల్లులకు ఆమోదం తెలిపేందుకు కేంద్ర యోచస్తోందని తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ- ఎన్నికలు, G-20 శిఖరాగ్ర సదస్సు, చంద్రయాన్-3 విజయవంతం లాంటి అంశాలు ఎజెండాలో ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణకు జస్టిస్ రోహిణి కమిషన్ చేసిన సిఫార్సుల ఆమోదం లాంటి అంశాలను చర్చిస్తారని సమాచారం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. మరి ముందస్తు ఎన్నికల ప్రకటన కూడా ఉంటుందా..? 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయా?