
Sachin Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే షాకిచ్చారు. సచిన్ ఇంటి ముందు ప్రహార్ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు.
భారతరత్న పురస్కార అందుకున్న సచిన్.. ఓ యాడ్ లో నటించడంపై ఆ ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. సచిన్ ఓ ఆన్‌లైన్ గేమ్స్ కు ప్రచార కర్తగా ఉన్నారు. ఇలా ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే బచ్చూ కాడూ ప్రశ్నించారు. యువత జీవితాలను నాశనం చేసే యాడ్స్ లో నటించడాన్ని తప్పుపట్టారు. సచిన్ భారతరత్న పురస్కారాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆన్‌లైన్ గేమ్స్ యాడ్స్ నుంచి సచిన్ తప్పుకోవాలని ఎమ్మెల్యే బచ్చూ కాడూ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రతి గణేశ్ మంటపం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే, ఆయన అనుచరులను అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యే బచ్చూ కాడూతోపాటు 22 మందిపై కేసులు నమోదు చేశారు.