అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రయాణికులు విమానం ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలంటే వణికిపోతున్నారు. ఇటీవల ఈ సంస్థ విమానాల్లో తరుచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానానికి కూడా తృటిలో ప్రమాదం తప్పింది.
ఆదివారం త్రివేండ్రం నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం AI 2455.. టేకాఫ్ కాగానే కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు వణికిపోయారు. ఈ విమానంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌తోపాటు పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.
పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీ వేణుగోపాల్, మరికొందరు ఎంపీలు త్రివేండ్రం నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. గాల్లోకి వెళ్లిన కాసేపటికే విమానం భారీగా కుదుపులకు గురైంది. ఈ ఘటనపై కేసీ వేణుగోపాల్స్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో స్పందించారు. తమకు ఎదురైన చేదు విషయాన్ని వివరించారు. ‘‘విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. విమానంలో అలజడి నెలకొంది. సుమారు గంట తర్వాత విమానం సిగ్నల్ వ్యవస్థలో ఏదో లోపం తలెత్తినట్లు తెలిపారు. ఆ తర్వాత విమానాన్ని చెన్నైకి మళ్లించారు’’ అని తెలిపారు.
‘‘అక్కడ విమానం ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లభించలేదు. సుమారు 2 గంటల పాటు విమానం గాల్లో చక్కర్లుకొడుతూనే ఉంది. సరిగ్గా ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా.. మరో విమానం రన్‌వేపై ఉందని తెలిసింది. దీంతో కొన్ని సెకన్లలో పైలెట్ విమానాన్ని మళ్లీ గాల్లోకి లేపారు. ఆ క్షణం మాకు గుండె ఆగినంతపనైంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలతో బయటపడ్డారు. రెండో ప్రయత్నంలో విమానం సేఫ్‌గా ల్యాండైంది. కానీ, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడి ఉండకూడదు’’ అని తెలిపారు. ఈ సందర్భంగా DGCA India, పౌర విమానాయాన శాఖలకు ఈ పోస్ట్‌ను ట్యాగ్ చేసి.. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరారు.
Air India flight AI 2455 from Trivandrum to Delhi – carrying myself, several MPs, and hundreds of passengers – came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
Also Read: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు