AMIT Shah Calls DMK Corrupt| తమిళనాడులో 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం తమిళనాడులోని అనేక జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన అమిత్ షా ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు.
“తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారందరూ డీఎంకేలో చేరారు. క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు వంటి అనేక అవినీతి కేసులు డీఎంకే సభ్యులపై నమోదయ్యాయి. అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని కొన్నిసార్లు అనిపిస్తుంది.” అని స్టాలిన్ పార్టీని ఎత్తి పొడిచారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.
స్టాలిన్ చెప్పేవన్నీ అబద్దాలు
“తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై చేసే ఆరోపణలు అన్నీ అవాస్తవాలు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని ఆయన చేసే ఆరోపణల్లో వాస్తవం లేదు. యూపీఏ మరియు ఎన్డీయే ప్రభుత్వాల కాలంలో రాష్ట్రానికి కేటాయించిన నిధులను పోల్చి చూస్తే, ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది.” జనగణన (సెన్సస్ డిలిమిటేషన్) తరువాత తమిళనాడు నష్టపోతుందనేది అవాస్తవమని.. ఎవరికీ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: ప్రశాంత్ కిశోర్ వ్యూహం విజయ్ గ్లామర్ – తమిళనాడులో క్రేజీ కాంబో
వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. “కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఈ అంశాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 40 పార్టీలను ఆహ్వానించారు.
ఈ అంశంపై అమిత్ షా స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడు 8 లోక్‌సభ సీట్లను కోల్పోవచ్చని సీఎం స్టాలిన్ హెచ్చరించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిని తిరస్కరించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని, ప్రధానమంత్రి మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన తెలిపారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీనితో దక్షిణ రాష్ట్రాల పార్లమెంట్ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణను పాటించిన తమిళనాడు వంటి రాష్ట్రాలు శిక్షించబడకూడదని ఆయన వాదించారు. ఈ విషయంపై మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్టాలిన్ వైఖరిని సమర్థించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా తోపాటు రాష్ట్రాల ఆర్థిక సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఇక హిందీ భాషా వ్యతికేరకత పట్ల కూడా అమిత్ షా సమాధానం చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం ప్రకారం, విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, తమిళనాడు ప్రభుత్వం ద్విభాషా సూత్రానికి మాత్రమే కట్టుబడి ఉంటుందని, హిందీని బలవంతంగా రుద్దడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ, “తమిళ భాషకు, ప్రజలకు మరియు రాష్ట్రానికి నష్టం కలిగించే ఏవైనా చర్యలను అనుమతించేది లేదు” అని పేర్కొన్నారు. ఈ వివాదం వల్ల తమిళనాడు నేతలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో, తమిళ భాషను కీర్తిస్తూ కేంద్ర గృహమంత్రి అమిత్ షా ప్రసంగించడం గమనార్హంగా ఉంది.