Anna Hazare Slams Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అంచుల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై లోక్ పాల్ బిల్లు ఉద్యమ నాయకుడు, గాంధేవాది అన్నా హజారె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ మద్యం విక్రయాలతో వచ్చే ధనం కోసం ఆశపడి తన ఓటమి కొనితెచ్చుకున్నారని అన్నా హజారె తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. కేజ్రీవాల్ రాజకీయాలలో పడి తన మూల సిద్ధంతాలను మరిచారని చురకలంటించారు.
“నేను ముందు నుంచీ చెబుతూ ఉన్నాను. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఉద్దేశం శుద్ధిగా ఉండాలి. ఆలోచనలు శుద్ధిగా ఉండాలి. అభ్యర్థి చరిత్రపై ఎటువంటి మచ్చలు ఉండకూడదు. జీవితం నిశ్కలంకంగా ఉండాలి. అభ్యర్థి జీవితంలో త్యాగం ఉండాలి. ఎవరైనా అవమానిస్తే సహించే శక్తి ఉండాలి. ఈ గుణాలు ఒక ఎన్నికల అభ్యర్థిలో ఉంటే ప్రజలు అతని విశ్వసిస్తారు. ఈ వ్యక్తి తమ కోసం ఏదైనా చేస్తాడు అని. నేను ఈ విషయాలు పలుమార్లు చెబుతూనే ఉన్నాను. కానీ ఆయన (కేజ్రీవాల్) నన్ను పట్టించుకోలేదు. చివరి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు. అదే మద్యం. మద్యం విక్రయాలు. మద్యం గురించి ఎందుకు లేవనెత్తాడంటే.. దాని ద్వారా ధనం, విపరీతమైన ధనం వస్తుంది కాబట్టి. ఆ ధనం కోసం ఆశపడే ఆయన మొత్తం కోల్పోయారు”. అని అన్నా హజారే కేజ్రీవాల్ తీరును తప్పుబట్టారు.
అంతకుముందు ఫిబ్రవరి 5, 2025న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయంలో కూడా అన్నా హజారె ఇలాగే స్పందించారు. “కేజ్రీవాల్ చేసుకున్న పాపానికి అనుభవిస్తారని హెచ్చరించారు. కేజ్రీవాల్ సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన సమయం నుంచి ఆయనతో తాను మాట్లాడడం మానేశానని చెప్పారు. ఏదో సమాజ సేవ కార్యక్రమం కోసం ఇద్దరం కలిసి పనిచేశాం. అంతవరకే . తాను ఎవరిపైనా ఆరోపణలు చేయడం లేదని.. కానీ చేసుకున్న పాపం అనుభవించక తప్పదు” అని చెప్పారు.
87 ఏళ్ల అన్నా హజారె ఒక సామాజిక కార్యకర్త. మహాత్మ గాంధీ సిద్ధాంతాలపై నడిచే ఆయన 2011లో కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు లోక్ పాల్ చట్టం కోసం ఉద్యమాన్ని నడిపారు. ఆయన ఢిల్లీలోనే నిరహార దీక్ష చేపట్టి.. ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్.. అన్నా హజారె ఉద్యమంలో భాగంగా ఉన్నారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ విజయం దాదాపు ఖరారైంది. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బిజేపీ అధికారం చేసుకోబోతోంది. అంతకుముందు కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో పదేళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉండగా.. ఆప్ కంటే ముందు దశాబ్దకాలం పాటు ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. అయితే ఈసారి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అరెస్టు కావడం గమనార్హం.
BREAKING NEWS 🚨 Happy Anna Hazare says Kejriwal was overwhelmed by liquor & money power. pic.twitter.com/JQCMTYuh26
— Times Algebra (@TimesAlgebraIND) February 8, 2025