
Sushant Singh Rajput : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ బాలీవుడ్ స్టార్ ప్రాణాలు కోల్పోయి రెండేళ్లు దాటినా ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకడంలేదు. మృతికి స్పష్టమైన కారణాలు మాత్రం ఇప్పటివరకూ తేలలేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. సుశాంత్‌కు పోస్టుమార్టం చేసిన బృందంలో ఉన్న ఓ వ్యక్తి తాజాగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
సుశాంత్ ది హత్యేనని మార్చురీలో పనిచేసే సహాయకుడు రూప్‌కుమార్ షా ఆరోపించారు. సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు తాను పనిచేస్తున్న కూపర్ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం ఐదు మృతదేహాలను తీసుకొచ్చారని తెలిపారు. అందులో ఒక మృతదేహం వీఐపీది అని చెప్పారని… పోస్టుమార్టం చేసేందుకు తన సీనియర్‌లతో కలిసి వెళ్లానని వివరించారు. మృతదేహాన్ని చూడగానే నటుడు సుశాంత్‌దని గుర్తు పట్టానని తెలిపారు. అతని శరీరంపై పలు చోట్ల గుర్తులు ఉన్నాయని వెల్లడించారు. మెడపైనా కొన్ని గుర్తులు ఉన్నట్లు గమనించానని రూప్ కుమార్ షా చెప్పుకొచ్చారు. పోస్టుమార్టం జరిగేటప్పుడు కచ్చితంగా వీడియో రికార్డు చేయాలని కానీ పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో తాము కేవలం ఫొటోలు మాత్రమే తీశామని రూప్‌కుమార్ తెలిపారు.
సుశాంత్ మృతదేహాన్ని చూడగానే అతడి శరీరంపై ఉన్న గుర్తులను బట్టి అది హత్య అని తన సీనియర్‌ల దృష్టికి తీసుకెళ్లానని రూప్ కుమార్ షా వెల్లడించారు. నిబంధనల ప్రకారం పోస్టు మార్టం పూర్తి చేయాలి కదా అని అడగ్గా, కేవలం ఫోటోలు మాత్రమే తీయాలని, వీలైనంత త్వరగా పోలీసులకు మృతదేహాన్ని అప్పగించాలని సీనియర్లు ఆదేశించారని తెలిపారు. దీంతో రాత్రి సమయంలో పోస్టుమార్టం చేయాల్సి వచ్చిందని రూప్‌కుమార్ పేర్కొన్నాడు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2020 జూన్ 14న ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనేక కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు సుశాంత్‌ది ఆత్మహత్యగా ప్రకటించారు. దీనిపై ఇప్పుడు పోస్ట్ మార్టం బృందంలోని ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలతో గతంలో ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. అప్పట్లో నటి రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి.
Congress : కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.. అందుకే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం : ఠాక్రే