Upendra Dwivedi : భారత్ ను రెండు వైపుల నుంచి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పాక్ – చైనాల మధ్య ఉన్న కుట్రపూరిత బంధాన్ని భారత్ అంగీకరించాల్సిందేనని భారత్ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఈ రెండు దేశాలతో భారత్ భద్రతకు ముప్పు పొంచి ఉందని జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య బంధాలు వర్చువల్ డొమైన్‌లో చాలా బలంగా ఉన్నాయన్న ద్వివేది. బహిరంగాగా.. చైనాకు సంబంధించిన అనేక ఉత్పత్తుల్ని, ఆయుధాల్ని పాకిస్థాన్ వినియోగిస్తోందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరువైపులా ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు.
పాక్ వైపు నుంచి ఎదురవుతున్న సమస్యలు, నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై స్పందించిన ఆర్మీ జనరల్.. వేసవి సమీపిస్తున్న కొద్దీ జమ్మూ కాశ్మీర్‌లో చొరబాట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వాటిని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు చొరబాట్లు పూర్తిగా ఆగే పరిస్థితులు లేవని.. అయితే ఎలాంటి చొరబాట్లనైనా అడ్డుకునేందుకు భారత్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చొరబాట్లను ఎదుర్కొనే విషయంలో భారత్ సైన్యం గణనీయమైన పురోగతి సాధించింది అన్నారు. 2018 నుంచి ఉగ్రవాద సంఘటనల సంఖ్యను 83 శాతం తగ్గించగలిగామని.. అన్నారు. కశ్మీర్ లోని లోయలో ఉగ్రవాద నియామకాలు బాగా తగ్గాయని… గతేడాది కాలంగా అక్కడ కేవలం 45 మంది మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాల్లోకి ఆకర్షితులయ్యారని జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు.
భారత సైన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో లోయలో శాంతి భద్రతలు మెరుగవుతున్నాయని, ఆ కారణంగానే పర్యాటకం పెరిగిందని గుర్తు చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదుల బెదిరింపుల మధ్య కూడా ఐదు లక్షలకు పైగా ప్రజలు పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రలో పాల్గొని, పరమ శివుడిని దర్శించుకున్నారని తెలిపారు. సైన్యం ప్రయత్నాలు కారణంగా ఈ ప్రాంతం దృష్టిని ఉగ్రవాదం నుంచి పర్యాటకం వైపు విజయవంతంగా మార్చాగలిగామని ప్రకటించారు.
గతేడాది భారత సైన్యం సరిహద్దుల్లో నిరోధించిన ఇస్లామిక్ టెర్రరిస్టుల్లో 60 శాతానికి పైగా పాకిస్తాన్ మూలానికి చెందినవారేనని, ఇది పొరుగు దేశం నుంచి దేశం ఎదుర్కొంటున్న బాహ్య ముప్పు ప్రభావాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఉగ్రవాద ప్రభావిత జమ్మూ కాశ్మీర్ నుంచి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA) ను తొలగించడం ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరణీయం కాదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. స్థానిక పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించే స్థితికి చేరుకున్న తర్వాత AFSPA ను రద్దు చేయవచ్చని అన్నారు.
చైనాతో ఘర్షణల తర్వాత లద్దాఖ్ ప్రాంతంలో పరిస్థితులు ఈ మధ్య కాలంలో కాస్త కుదుటపడ్డాయని తెలిపిన సైన్యాధ్యక్షుడు.. ఇరువైపుల పశువుల మేత మేపుకునే ప్రాంతాలను తిరిగి తెరిచినట్లు వెల్లడించారు. అయినా.. ఇంకా ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరిన పరిస్థితులు లేవన్నారు.
Also Read : Women Scheme : మహిళల్ని మహారాణులుగా చేసే పథకాలు – వీటి ప్రయోజనాల గురించి తెలుసా.?
భారత్ – చైనా సరిహద్దుల మధ్య 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తాయి. ఈ సంఘటనలో 20 మంది భారత సైనికులు చనిపోగా.. అంతుకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులు చనిపోయారని వెల్లడైంది. ఇరు దేశాల మధ్యలోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, ప్రత్యేకంగా గల్వాన్ లోయ, డెప్సాంగ్, డెమ్చోక్ వంటి ప్రాంతాల్లో సైనిక మోహరింపు, పెట్రోలింగ్ సంబంధిత సమస్యలు.. ఈ ఘర్షణలకు కారణంగా చెబుతున్నారు. కాగా.. ఈ సంఘటనల తర్వాత, ఇరు దేశాలు సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాయి. చివరగా.. 2024 అక్టోబర్‌లో డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణను పూర్తి చేశారు.