Kishan Reddy: తెలంగాణలో పది జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదారాబాద్, బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో రూ.6280 కోట్లతో 285 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను నిర్మించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు గురించి కూడా నితిన్ గడ్కరీతో చర్చించామని అన్నారు. కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతోందని చెప్పారు. ఫైనాన్స్ కు సంబంధించి ట్రై పార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి రూ.18,772 కోట్లు ఖర్చు అవుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అంచనా వ్యయాన్ని అధికారులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నోట్ కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా మంత్రి కిషన్ రెడ్డి. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరు లేన్ల హైవే పూర్తి అయిందని చెప్పారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు వెళ్లే వాళ్ల కోసం సిగ్నల్ ఫ్రీ రోడ్డు కూడా పూర్తి అయిందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే నెలలో బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాబోతోందని చెప్పుకొచ్చారు. బీహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్ పూర్తి అయితే కూకట్‌పల్లి-పటాన్‌చెరు మధ్య ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
హైదారాబాద్-పుణే మార్గంలో బీహెచ్ఈఎల్ వద్ద నేషనల్ హైవే 65పై ఫ్లైఓవర్ పూర్తి అయ్యిందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ ఫ్లైఓవర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా వెళ్లొచ్చని చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. జాతీయ రహదారి 61 (17 కి.మీ), జాతీయ రహదారి 65 (22 కి.మీ.) కంప్లీట్ అయ్యిందన్నారు. జనగాం – దుద్దెడ మార్గంలో భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేసి ఇస్తే.. అంతే త్వరగా రోడ్డు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఖమ్మం – విజయవాడ మధ్య వెంకటాయపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి కిషన్ రెడ్డ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. కాంగ్రెస్ తమపై అనవసర ఆరోపణలు చేస్తుందన్నారు. ఇది సరైన పద్దతి కాదని మంత్రి చెప్పారు తెలంగాణలో ఓట్లు, జనాభా తగ్గినా.. ఒక్క పార్లమెంట్ సీటు తగ్గదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాక ముందు రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలకు ఎటుపోయాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు ముందు వేసుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యిందని.. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు వరంగల్ వెళ్లి చూసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.