Arvind Kejriwal Political Journey | అరవింద్ కేజ్రీవాల్ ఒక భారతీయ సామాజిక కార్యకర్తగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయం సాధించారు. కానీ ఆయన తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అసామాన్య రాజకీయ ప్రస్థానం సాగించారు కేజ్రీవాల్.
హర్యానాలోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన అరవింద్ కేజ్రీవాల్ ఐఐటి ఖరగ్పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. తన ప్రారంభ జీవితంలో భారతీయ రెవెన్యూ సర్వీసులో పనిచేశారు. జన లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. 2006లో సమాచార హక్కు చట్టం తీసుకురావడం, పేదల స్థితిని మెరుగుపరచడానికి చేసిన కృషికి కేజ్రీవాల్ రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని (AAM Aadmi Party) స్థాపించారు. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఢిల్లీకి 7వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేజ్రీవాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు. అయితే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా.. మద్యం పాలసీ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఐఐటి ఖరగ్పూర్‌లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, 1989లో టాటా స్టీల్‌లో మూడేళ్ల పాటు ఉద్యోగం చేసారు. 1992లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత భారతీయ రెవెన్యూ సర్వీసులో చేరారు. 1999లో పరివర్తన్ అనే సామాజిక సంస్థను స్థాపించి, ఢిల్లీలోని ప్రజలకు పన్నులు, విద్యుత్, ఆహార పంపిణీ విషయాలపై అవగాహన కల్పించడంలో సహాయపడ్డారు. 2008లో.. పరివర్తన్ సంస్థ ఢిల్లీలోని నకిలీ రేషన్ కార్డ్ స్కాండల్‌ను బయటపెట్టింది.
2012లో, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తమ పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఢిల్లీ శాసనసభలో ఆమ్మ ఆద్మీ పార్టీ ప్రవేశ పెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో కేజ్రీవాల్ 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 2014లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Also Read: మద్యం, ధన దాహంతోనే కేజ్రివాల్ ఓటమి.. అన్నా హజారే విమర్శలు
తిరిగి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీచేస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలలో 67 స్థానాలు గెలుచుకుని అపూర్వ విజయం సాధించింది. కేజ్రీవాల్ రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2020 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలతో విజయం సాధించింది. ఢిల్లీ ప్రజల కోసం కేజ్రీవాల్ మంచి స్కూళ్లు, ఉచిత ఆస్పత్రులు, ఉచిత విద్యుత్‌తో పాటు మహిళల కోసం బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలన అమలు చేసి స్థానిక ప్రజల నుంచి ప్రశంసలందుకున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం సొంతం చేసుకుంది.
2024లో.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇది భారతదేశంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అరెస్టు అయిన మొదటి సందర్భం. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత, కేజ్రీవాల్ 2024 సెప్టెంబరు 17న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేజ్రీవాల్ 2012లో “స్వరాజ్” అనే పుస్తకాన్ని ప్రచురించారు. అయన అనేక పురస్కారాలు అందుకున్నారు. వీటిలో ప్రముఖంగా 2006లో రామన్ మెగసెసే అవార్డు (Ramon Magsaysay award), 2011లో ఎన్‌డిటివి ఇండియన్ ఆఫ్ ది ఇయర్, 2014లో టైమ్ మ్యాగజైన్ “టైమ్ 100” పోల్‌లో స్థానం సాధించడం ఉన్నాయి.