Assam Mine Tragedy : అసోంలోని డిమా హసావో జిల్లాలోని గనిలో అక్రమ మైనింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చి చేరిన వరద నీటిలో చిక్కుకున్న కార్మికుల్లో అదివారం మరో మూడు మృతదేహాలని అధికారులు వెలికి తీశారు. ఘటన జరిగిన ఆరు రోజులకు వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు సమయం పట్టింది. దీంతో సహాయక చర్యలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నలుగురు కార్మికుల మృతదేహాల్ని కనుక్కున్నట్లైంది. కాగా.. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు వరకు మైనర్ బాలులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వారంతా.. ఈ పాటికే మరణించి ఉంటారని.. ఇప్పటికే ఐదు రోజులు కావడం, పూర్తిగా నీటితో మునిగిపోవడంతో బతికి ఉండే అవకాశాలు లేవని అంటున్నారు.
దిమా హసావో గనిలో.. విస్తృతమైన బొగ్గు, సున్నపురాయి, గ్రానైట్ లభిస్తుంది. ప్రభుత్వం మూసేసిన గనిలో అక్రమంగా తవ్వకాలు చేపట్టిన కారణంగా ఈ ప్రమాదం జరగగా.. అందుకు కారణమైన ఓ వ్యక్తిని దీమా హసావో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా.. తాజాగా అబ్దుల్ గనన్ లస్కర్ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. ఇది అక్రమ గని కాదని వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ.. అస్సాం మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (AMDC) నిర్వహించిందని, 12 ఏళ్ల క్రితం తవ్వకాలు నిలిపివేసినట్లు వెల్లడించారు. అయితే.. ప్రమాద సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా.. అక్రమంగా, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేపట్టారని తెలిపారు.
రాజకీయ ఆందోళనలు
ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. 2014లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నిషేధించినప్పటికీ.. మైనింగ్ ఎలా జరిగిందని ప్రశ్నిస్తున్నారు. స్థానిక అధికారులకు తెలియకుండా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఎలా జరుగుతాయంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కోరుతూ అస్సాం కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రధానికి మోదీకి లేఖ రాశారు.
గనిలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించాలని, ఈ విషాదానికి బాధ్యులను గుర్తించి శిక్షించాలని అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాథోల్ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ – NGT నిషేధాన్ని అమలు చేయడంలో వైఫల్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిషేధాన్ని అమలు చేయడంలో.. స్థానిక అధికారులు, జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుల శాఖ వైఫల్యాలపై సిట్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోని గనుల్లోనూ పదేపదే ప్రమాదాలు జరుగుతున్నా.. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పదేపదే జాగ్రత్తలు, అక్రమ మైనింగ్ పై చర్యల గురించి ప్రస్తావిస్తున్నా.. కర్బీ అంగ్లాంగ్, దిమా హసావో సహా ఎగువ అస్సాంలోని ఇతర అక్రమ మైనింగ్ నిరాటంకంగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఈ ఘటనలో దిమా హసావో అటానమస్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు దెబోలాల్ గొర్లోసా అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ సభ్యుడు గొర్లోసా, అతని భార్యపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. వీరిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల్ని గోర్లోసా ఖండించారు. తనపై జరుగుతుంది అంతా రాజకీయ దాడిగా కొట్టిపారేశారు. రథోల్ మైనింగ్‌ను న్యాయస్థానం నిషేధించిదని, అందులోని ఎవరో ప్రవేశిస్తే తామకేంటి సంబంధం అని ప్రశ్నించారు. విచారణ జరుగుతోందని అందులో అన్ని విషయాలు వెల్లడవుతాయన్నారు.
Also Read : శబరిమల భక్తులకు ఉచిత ప్రమాద బీమా.. నష్టపరిహారం ఎంతంటే?..
ఇదే విషయమైన.. ముఖ్యమంత్రి భిస్వంత్ కుమార్ శర్మను ప్రశ్నించగా.. ప్రమాద ఘటనపై అన్ని అంశాల్ని దర్యాప్తు బృందం పరిశీలనలోకి తీసుకుంటుందన్న సీఎం.. అక్కడ జరిగిన విచారకర ఘటనను రాజకీయం చేయడం తగదని వ్యాఖ్యానించారు.