– కేజ్రీవాల్ స్థానంలో సీఎంగా ఛాన్స్
– 11 ఏళ్లలో వాలంటీర్ నుంచి సీఎం
– ఆప్ పాలసీ మేకర్‌గా, స్ట్రాటజిస్ట్‌గా గుర్తింపు
– 43 ఏళ్లకే ఢిల్లీ మూడో మహిళా సీఎంగా రికార్డు
– మంత్రిగా 14 శాఖలను చూసిన అతిశీ
Atishi Marlena: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆప్ యువనేత అతిశీ శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయటం, తర్వాత జరిగిన ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో కేజ్రీవాల్ స్వయంగా అతిశీని తదుపరి ముఖ్యమంత్రిగా ప్రతిపాదించటంతో 43 ఏళ్ల అదితి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీని పాలించిన షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ వంటి దిగ్గజ నేతల కోవలో.. ఆ రాష్ట్రానికి మూడవ మహిళా సీఎంగా అతిశీ రికార్డులకెక్కనున్నారు.
మంత్రులుగా వీరే..
ఢిల్లీ ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణం చేయనున్న అతిశీతో బాటు మరో నలుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కాగా, సుల్తాన్ పూర్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్‌కూ కేబినెట్‌లో బెర్త్ లభించే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీకి మూడో సీఎం
ఆప్ ఏర్పడిన తొలి రోజుల్లో పార్టీలో చేరిన అతిశీ, పార్టీ పాలసీ మేకింగ్ విభాగంలో చురుగ్గా పనిచేశారు. మనీష్ సిసోడియా విద్యా మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో కీలక సభ్యురాలిగా, పార్టీకి అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. సిసోడియా, కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలో 14 శాఖలకు ఆమె బాధ్యత వహించారు.
Also Read: Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..
అతిశీకి ఛాన్స్ అందుకేనా?
ఆప్ నేతల అవినీతి, అనైతిక ప్రవర్తనను నిలదీసిన ఆప్ రాజ్యసభ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఆప్ నేతలు చేసిన దాడి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం, 2015 నుంచి 2023 వరకు ఆప్ మంత్రివర్గంలో మహిళలే లేకపోవటం వంటి అంశాల వల్ల ఢిల్లీలో ఆప్ పార్టీ మీద మహిళల్లో వ్యతిరేకత మొదలైందని గుర్తించిన కేజ్రీవాల్.. వారి ఓట్లను రాబట్టేందుకే మహిళా కార్డును ప్రయోగించి, అతిశీకి అవకాశం కల్పించారని తెలుస్తోంది.
అదే నా లక్ష్యం
మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయటమే తన ఏకైక లక్ష్యమని అతిశీ ప్రకటించారు. తనపై కేజ్రీవాల్ నమ్మకం ఉంచినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘ఢిల్లీలో ఒకే సీఎం ఉన్నారు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్’ అని ఆమె వ్యాఖ్యానించారు. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీలు సృష్టించే ఆటంకాలను అధిగమించి తిరిగి ఆప్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా రాబోయే నాలుగైదు నెలలు బాగా కష్టపడాలని ఆమె పిలుపునిచ్చారు.