Sourav Ganguly Bengal Teachers| పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయుల నియామక కుంభకోణంపై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టింది. 2016లో చేపట్టిన మొత్తం 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చట్టబద్ధంగా లేవని కోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా హైకోర్టు.. గతంలో ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో పాటు, ఇప్పటికే అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అయితే దీని వల్ల చాలామంది అర్హత ఉన్న టీచర్లు తమక అన్యాయం జరుగుతోందని నిరసన చేపట్టారు.
ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది ఉపాధ్యాయులు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీని కోల్ కతా నగరంలో కలిసేందుకు వెళ్లారు. కోల్‌కతాలోని ఆయన నివాసానికి వెళ్లి ఆయనను కలిసి, తమ సమస్యలను వివరించాలని వెళ్లగా వారిని నిరాశ ఎదురైంది. ఏప్రిల్ 21న తాము పశ్చిమబెంగాల్ సచివాలయం వరకు నిర్వహించనున్న నిరసన ప్రదర్శనకు గంగూలీ హాజరు కావాలని, తమకు అండగా నిలవాలని కోరారు.
కానీ ఇదంతా చాలా డ్రామాటిక్ గా జరిగింది. గంగూలీ ఇంటి బయట ఉన్న పోలీసులు నిరసన చేస్తున్న టీచర్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకు అండగా చక్రిహారా ఓయిక్యామంచ్ అనే సామాజిక సంస్థ అండగా నిలబడింది. ఈ చక్రిహారా సంస్థ ఆధ్వర్యంలోనే నిరసన జరుగుతోంది ఈ నేపథ్యంలో చక్రిహారా సంస్థ సభ్యులతో పాటు కొంతమంది టీచర్లు సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లారు. ఏ తప్పు చేయని, అర్హత ఉన్న టీచర్ల నియామకాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తాము నిరసన చేస్తున్నామని అందుకే నిరసనకు మద్దతు తెలపాలని వారు అభ్యర్థించారు.
కానీ జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సౌరవ్ గంగూలీ.. టీచర్ల నిరసనలో తాను పాల్గొనేది లేదని. .తనను రాజకీయాల్లోకి లాగొద్దని వారికి సమాధానమిచ్చారు.
Also Read: 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక.. కష్టాలుపడి ఇంటికి తిరిగివస్తే షాకింగ్ దృశ్యం
మరోవైపు ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లు కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని తాజాగా సుప్రీంకోర్టు స్వల్ప ఉపశమనం ఇచ్చింది. ఇది గ్రూప్-C, గ్రూప్-D, నాన్-టీచింగ్ సిబ్బందికి వర్తించదు. ఇక మే 31లోపు కొత్త నియామక ప్రకటన జారీ చేసి, డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని SSCను కోర్టు ఆదేశించింది. ఆ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.