Bengaluru Stampede| బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో 11 మంది మరణించారు, 56 మంది గాయపడ్డారు. ఈ హృదయవిదారక సంఘటన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీరియస్ గా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే స్టేడియంను వేరే చోటికి తరలించే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటన ఏ ప్రభుత్వంలోనూ జరగకూడదని, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు.
ఈ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకులిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబం సమాధి వద్ద కన్నీటితో విలపిస్తూ కనిపించింది. ఆర్‌సీబీ విజయాన్ని జరుపుకోవడానికి స్టేడియంకు వచ్చిన వారు, ఈ విషాదకర సంఘటనలో చిక్కుకున్నారు. తండ్రి తన కొడుకుతో కలిసి ఆనందంగా గడపాలని వచ్చిన ఆ క్షణం, శాశ్వత విషాదంగా మారిపోయింది. వారి కుటుంబం ఇప్పుడు అనాథగా తీరని బాధలో మునిగిపోయింది.
ప్రభుత్వం ఈ దుర్ఘటనపై తక్షణ చర్యలు తీసుకుంది. భద్రతా ఏర్పాట్లలో విఫలమైన ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వీరితో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిపై కూడా వేటు వేశారు. సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని, అయినప్పటికీ ఈ సంఘటన బాధాకరమని చెప్పారు. భద్రతా వైఫల్యాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వానికి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాలకు పరిహారం.. మొదట రూ. 10 లక్షలుగా ప్రకటించారు. ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి ఎక్కువ కావడంతో.. దాన్ని రూ. 25 లక్షలకు పెంచారు. ఈ పరిహారం బాధిత కుటుంబాలకు కొంత ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్‌సీబీ విజయోత్సవ ఈవెంట్‌ను.. విధాన సౌధ ముందు నిర్వహించడంపై సిద్దరామయ్య సమర్థించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) నిర్వహించిందని, తాను కేవలం అతిథిగా హాజరైనట్లు చెప్పారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్చరిక లేఖను నిర్లక్ష్యం చేసి, ఈవెంట్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (డీపీఏఆర్) అనుమతి ఇచ్చిందని వివరించారు.
Also Read: ఫ్యాన్స్ చనిపోయినా పట్టించుకోరా?.. సోషల్ మీడియాలో ఆర్సీబీ విజయోత్సవాలపై ట్రోలింగ్..
స్టేడియంలో జరిగిన ఈ దుర్ఘటన గురించి తనకు సాయంత్రం 5:45 తర్వాతే తెలిసిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. స్టేడియంను తరలించాలనే డిమాండ్‌పై, సరైన ప్రదేశం కనుగొన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా భద్రతా చర్యలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు.