Plane Crash Bhagavad Gita| అహ్మదాబాద్‌లో గురువారం జూన్ 13, 2025న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటనలో ఒక అద్భుతం జరిగింది. తీవ్రమైన మంటల మధ్య హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతకు మాత్రం ఏ హాని కలుగులేదు. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171.. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తూ గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విమానంలో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. విమాన శిథిలాలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పడ్డాయి. అక్కడి వైద్య కళాశాల హాస్టల్‌పై విమాన భాగాలు పడటంతో 24 మంది విద్యార్థులు కూడా మరణించారు.
ఈ దుర్ఘటన తర్వాత.. మంటల్లో కాలిన శిథిలాల మధ్య ఒక భగవద్గీత గ్రంథం కనిపించింది. విమానంలోని 1.25 లక్షల లీటర్ల ఇంధనం మండడం వల్ల తీవ్రమైన వేడి కారణంగా చాలా వస్తువులు కాలి బూడిదైపోయాయి. అయినప్పటికీ.. ఈ పవిత్ర గ్రంథం చెక్కు చెదరలేదు. దాని పేజీలు, అక్షరాలు, చిత్రాలు స్పష్టంగా కనిపించాయి. కవర్ మాత్రం కొద్దిగా దెబ్బతింది.
ఈ సంఘటనను చూసిన రెస్క్యూ బృందంలోని ఒక సభ్యుడు.. “ఈ పుస్తకం ఒక ప్రయాణికుడిది కావచ్చు. ఎవరైనా దీన్ని చదువుతూ ఉండి ఉంటారు. అందుకే ఇది ఇక్కడ ఉంది. ఇంత తీవ్రమైన మంటల్లో కూడా ఇది సురక్షితంగా ఉంది. స్వామి ప్రభుపాద (ఇస్కాన్ స్థాపకుడు) చిత్రం సహా ప్రతి చిత్రం స్పష్టంగా ఉంది,” అని చెప్పారు.
ఈ భగవద్గీత పుస్తకం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది దీన్ని ఓ అద్భుతంగా భావిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం దీన్ని యాదృచ్ఛికంగా పరిగణించారు. కొన్ని పేజీలపై చిన్న మచ్చలు కనిపించినప్పటికీ, పుస్తకం దాదాపు పరిపూర్ణంగా ఉందని అక్కడ కవరేజీ చేసిన ఒక జాతీయ మీడియా సంస్థ రిపోర్టర్ తెలిపారు.
Also Read: నేను దూకలేదు.. విమానం ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకేఒక్కడు ఏం చెప్పాడంటే
ఈ ప్రమాదంలో ఒక బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ దుర్ఘటన భారత విమానయాన చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా మరణించారు. చనిపోయిన వారి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉన్నాయని.. అందుకే వారి కుటుంబాలకు అప్పగించేందుకు వారి బంధువులు డిఎన్‌ఏ రిపోర్ట్ లతో రావాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ప్రస్తుతం ప్రమాద కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు జరుగుతోంది. విమాన శిథిలాల్లో నుంచి ఒక బ్లాక్ బాక్స్ లభించింది. ఈ దుర్ఘటనలో భగవద్గీత సురక్షితంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన ఒక అద్భుతంగా, ఆధ్యాత్మిక శక్తిగా చాలా మంది భావిస్తున్నారు.