Bhopal Gas Tragedy : ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఇండస్ట్రీయల్ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచే భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి దాదాపు 40 ఏళ్లు నిండాయి. అయినా.. అక్కడ ఇంకా ఆ ప్రమాదానికి దారితీసిన విషపదార్థాలు టన్నుల కొద్దీ నిలువచేసి ఉన్నాయి. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అధికారులు.. ఆ వ్యర్థాలను తొలగించే ప్రయత్నాలు ప్రారంభించారు. భోపాల్ లో యూనియన్ కార్బైడ్ సంస్థ ప్రాంగణంలో దాదాపు 40 ఏళ్లుగా నిల్వచేసి ఉంచిన 377 టన్నుల విష పదార్థాలను (Union Carbide toxic waste) అధికారులు తరలిస్తున్నారు.
అత్యంత విషపూరిత పదార్థులు కావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అత్యంత పకడ్బందీగా, ప్రత్యేకంగా తయారుచేసిన 12 లీక్ ప్రూఫ్, ఫైర్
రెసిస్టెంట్ కంటైనర్లలో ఈ విషపదార్థాలను లోడ్ చేశారు. ప్రతి కంటైనర్ రసాయన ప్రతిచర్యలను నివారించడానికి జంబో HDPE సంచులలో ప్యాక్ చేశారు. ఒక్కో ట్రక్ ద్వారా సుమారు 30 టన్నుల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు ముందు గానే.. పరిసర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ చుట్టూ 200 మీటర్ల వరకు పూర్తిగా మూసివేశారు. ఫ్యాక్టరీ నుంచి పితంపూర్ కి తరలిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 250 కిలోమీటర్లను గ్రీన్ ఫీల్డ్ గా మార్చేశారు. ఈ కంటైనర్ల ముందూ, వెనుక పోలీసు ఏస్కార్ట్ ఏర్పాటు చేశారు. సాయుధులైన సిబ్బంది రక్షణగా ఉంటుండగా.. అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ సిబ్బంది.. ఈ కంటైనర్ల వెంట వెళ్లనున్నారు.
పకడ్భందీగా ఏర్పాట్లు
చరిత్రలోనే అత్యంత విషాధ ఘటనగా నిలిచిపోయిన ఇక్కడి రసాయనాల లీకేజీతో.. మరోమారు ఎలాంటి పొరబాట్లకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ తొలగింపులో దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. సిబ్బందిపై ఎలాంటి రసాయన ప్రభావం పడకుండా ఉండేందుకు పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డాక్టర్లు, నిపుణులు అక్కడికి చేరుకుని తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఫ్యాక్టరీ ఆవరణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న పోలీసు బలగాలు… ఇతరుల ఎవర్నీ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వడం లేదు.
పితంపూర్ ప్లాంట్
మధ్యప్రదేశ్‌లోని పితంపూర్‌లోని అత్యాధునిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ ఉంది. ఇది CPCB మార్గదర్శకాల ప్రకారం రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్ సంస్థ నిర్వహిస్తోంది. కాగా.. భోపాల్ గ్యాస్ వ్యర్థాలను ఇక్కడకు తరలించడాన్ని.. స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమకు వాటి వల్ల ఏమైనా ప్రమాదం జరిగే అవకాశముందని ఆందోళనలు చేస్తున్నారు. కాగా.. మధ్యప్రదేశ్ లో ఈ ప్లాంట్ మాత్రమే.. ఈ వ్యర్థాలను దహనం చేయగలదని అధికారులు చెబుతున్నారు. తొలుత కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దహనం చేసి.. వచ్చిన బూడిదలో ఏమైనా రసాయన అవశేషాలు ఉన్నాయో లేదో శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిర్ణయిస్తామన్నారు. వాటి ఫలితాల ఆధారంగానే తర్వాత మిగిలిన వ్యర్థాల్ని కాల్చేస్తామని ప్రకటించారు. ఈ రసాయనాల బూడిదను రెండంచెల్లో భద్రపరిచి భూస్థాపితం చేయనున్నట్లు తెలిపిన అధికారులు.. ఈ బూడిద ఎక్కడా భూమిలోకి ఇంకిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వ్యర్థాలను అత్యంత కఠినమైన శాస్త్రీయ ప్రోటోకాల్‌లను అనుసరించి కాల్చివేయనున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ ప్లాంట్ ద్వారా గంటకు 90 కిలోలను కాల్చి వేస్తుండగా.. మొత్తం 337 టన్నుల వ్యర్థాలను దహనం చేసేందుకు 153 రోజులు పట్టనుంది. అదే గంటకు 270 కిలోలను దహనం చేసినట్లైతే.. 51 రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేయవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు.
చారిత్రక తప్పిదం.. లక్షల మందికి శాపం
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ పురుగు మందుల కర్మాగారం ఉంది. ఇందులో.. 1984 డిసెంబరు 3న ప్రమాదకరమైన గ్యాస్ లీకైంది. ఇక్కడి ట్యాంకుల నుంచి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ వాయువులు గాల్లోకి లీకైంది. దాంతో.. సమీపంలోని ప్రజలకు నరకప్రాయంగా మారింది. వారు పీల్చే గాలి విషపూరితమై.. ఊపిరితిత్తుల్లోకి చేరింది. దీంతో.. చాలా మంది ఉన్నచోటనే రోడ్లపై కుప్పకూలి చనిపోయారు. ఈ దుర్ఘటనలో గ్యాస్ లీకేజీ కారణంగా మొదటి 3 రోజుల్లో 10 వేల మంది మృత్యువాత పడగా.. మొత్తంగా పాతిక వేల మంది వరకు మరణించినట్లు అంచనా. గాయపడ్డవారి సంఖ్య దాదాపు 6 లక్షలని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ.. అధికారిక లెక్కల్లో మాత్రం మృతుల సంఖ్యను చాలా తక్కువగా చూపారన్న ఆరోపణలు ఉన్నాయి.