Big Stories

Nitish Kumar: హాట్ టాపిక్‌గా మారిన నితీశ్ కుమార్ ఫోన్ కాల్ వ్యాఖ్యలు.. కేసీఆర్‌కు షాక్

Nitish Kumar: కలిసి వచ్చే నేతలతో ముందుకెళ్లి.. బీజేపీకి ప్రత్యామ్నయ శక్తిగా ఎదుగుదామనుకున్న కేసీఆర్ వ్యూహాలు ఫలించడం లేదు. మోదీతో ఢీ అంటే ఢీ అంటారని అనుకున్న నేతలు .. మున్ముందు కమలంతోనే మళ్లీ జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత పొత్తులు కొత్త ఎత్తులతో ముందుకు రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ వ్యవహారం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇంతకీ నితీష్ చేసిందేంటి..? గలాబీ దళపతి ఎందుకు ఎదుర్కొబోయే ఇబ్బందులేంటి..?

- Advertisement -

దేశం సార్వత్రిక ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన అమిత్ షా ఫోన్ కాల్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్డీయే కూటమి నుంచి గతేడాది బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు బీజేపీ వ్యతిరేక నేతలతో కలిసి పని చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

- Advertisement -

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో 2020 ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. అందులో బీజేపీ 77 స్థానాలు సాధించగా, నితీశ్ పార్టీ జేడీయూ 45 స్థానాల్లో గెలుపొందింది. జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ నితీశ్ కుమార్నే సీఎం స్థానంలో కూర్చోబెట్టింది. తర్వాతి కాలంలో రెండు పార్టీలకు మధ్య విభేదాలు రావడంతో గతేడాది ఆగస్టులో ఎన్డీయే కూటమిని వీడిన నితీశ్.. ప్రతిపక్షాలతో కలిసి మహాగట్‌బంధన్ కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి నితీశ్ బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని చాలా సార్లు ప్రకటించారు. చావనైనా చస్తాను కానీ, మళ్లీ బీజేపీతో చేతులు కలపననీ స్పష్టం చేశారు.

అయితే చూస్తున్నంతలోనే పరిస్థితుల్లో మళ్లీ మార్పు వచ్చింది. ప్రతిపక్ష కూటమిలో నితీష్‌ కీలకమవుతారన్న వారందరికీ షాక్ ఇస్తూ ఆయన తిరిగి బీజేపీ పంచనే చేరుతారన్న ఊహాగానాలు బీహార్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగా బీహార్‌కు విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్‌ను కొత్త గవర్నర్‌గా నియమించింది. అయితే రాష్ట్రానికి కొత్త గవర్నర్ రాక విషయాన్ని తెలియజేయడానికి గత రాత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని నితిష్ కుమార్ చెప్పారు.

అయితే నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్‌లలో ప్రభుత్వాలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థలను ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ గతేడాది ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి మహా గట్ బంధన్ పేరుతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పార్టీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్‌కు అమిత్ షా ఫోన్ చేయడం వెనక మతలబు ఏంటి అనే చర్చ జరుగుతోంది.

బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో పలువురు నేతలను నితీష్ కుమార్ స్వయంగా కలిశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి నితీష్ కుమార్‌ను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా..? అనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించి బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌కు దక్షిణాదిలో చాలా వరకు అనుకూల పరిస్థితులున్నాయి. కానీ ఉత్తరాదిలోనే ఆయనకు మద్దతు కరువైంది. అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చారు నితీష్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అండగా నిలవడంతో.. కేసీఆర్‌లో జోష్‌ రెండింతలైంది. బీజేపీతో పోరాడేందుకు ఉత్తరాదిలో తనకు బలమైన అస్త్రం దొరికిందని కేసీఆర్ భావించారు. కానీ ఇంతలోనే అమిత్‌షా ఫోన్‌కాల్‌ వ్యవహారం వెలుగు చూడడంతో… భవిష్యత్తులో గులాబీ బాస్‌కు నితీష్‌ సహకారం ఏ మేరకు ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

గతంలో ఖమ్మం సభకు తనను కేసీఆర్ ఆహ్వానించలేదని నితీష్ బహిరంగంగా చేసిన కామెంట్స్ రచ్చ రాజేశాయి. ఈ క్రమంలో సచివాలయం ప్రారంభోత్సవానికి ఆ పార్టీకి ఆహ్వానం పంపినా ఆ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో అమిత్ షా తో కాల్ వ్యవహారం నితీష్ కుమార్‌కు పొలిటికల్‌గా అగ్ని పరీక్షగా మారిందనే చర్చ జరుగుతోంది. మరి గులాబీ దళపతి నితీష్ కుమార్‌ను నమ్ముతారా..? నితీష్ కుమార్ తిరిగి బీజేపీతో కలిసి కేసీఆర్‌కు షాకిస్తారా అన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News