Dalit Votes Delhi Elections: త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ఆ వర్గం మద్దతును సమీకరించగలిగితేనే అధికారాన్ని దక్కించుకోవచ్చని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ), కాంగ్రెస్ పార్టీల నేతలు దళితుల ఓట్ల కోసం వ్యూహారచన చేస్తున్నారు. వారి ఓట్ల హామీలతో పోటీపడి వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని 70 నియోజకవర్గాల్లో 12 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేసి ఉంచారు. అయితే మొత్తం 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం లేదా పరాజయానికి దళితుల ఓట్లే కీలకం. అందుకే ఈ వర్గం వారిని ప్రసన్నం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం, ఢిల్లీ జనాభాలో దళితులు 16 శాతం. వీరిలో జాతవులు, రవిదాసియా, వాల్మీకీ వర్గాల వారు 50 శాతానికి పైగా ఉంటారు. మిగిలిన దళిత సామాజిక వర్గాలు 50 శాతానికి తక్కువగా ఉంటాయని అంచనా. పారిశుద్ధ్య పనులు చేసే వాల్మీకీ వర్గం అత్యధికంగా ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే ఉన్నారని సమాచారం.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు.. మద్యం, డ్రగ్స్ సీజ్
ఆప్ సర్కారుపై అసంతృప్తి
మూడోసారి అధికారంలోకి రావాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో దళితుల సంపూర్ణ మద్దతు పొందిన ఆప్ సర్కార్ పాలనపై ఈసారి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు రాకపోవడం ఈ అసంతృప్తికి కారణంగా పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఈసారి దళిత ఓటుల్లో ఆప్‌కు తగ్గుదల ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం, దళిత ఓటర్లలో 44 శాతం మంది ఆప్ వైపు ఉండగా, 22 శాతం బిజేపీ, 21 శాతం కాంగ్రెస్ వైపు ఉన్నారు.
ఎస్సీ స్థానాల్లో విజయం కోసం వేగం పెంచిన బిజేపీ
2015, 2020 ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వు స్థానాల్లో బిజేపీ ఏ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా 2-3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈసారి విజయానికి వ్యూహాలను సిద్ధం చేస్తూ, దళిత ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందుకే బిజేపీ ఎస్సీ మోర్చా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ జాప్యం
ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ భావిస్తున్నా, దళిత ఓటర్లను ఆకర్షించడంలో ఆలస్యం చేస్తోంది. ఆప్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ పార్టీ ప్రాచరంలో చాలా జాప్యం జరిగింది. కొంచెం ముందుస్తుగానే ప్రచారం ప్రారంభించి ఉంటే దళిత వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి మరింత మద్దతు లభించేదని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద, ఈ ఎన్నికల్లో దళితుల మద్దతు ఏ పార్టీకి విజయాన్ని అందించగలదనే అంశం కీలకంగా మారింది.