Delhi Elections | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాన పార్టీల మధ్య అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు గాను ఈసారి మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్ ఫైల్ చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, ఈసారి పోటీచేసే అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 672 మంది పోటీ చేశారు.
నామినేషన్ పత్రాలు: ఈసారి 981 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మొత్తం 1522 నామినేషన్లు రాగా, నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో, బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా తాజాగా ఎన్నికల అధికారుల ద్వారా ప్రకటించబడింది.
అత్యధిక పోటీ
ఈసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, (Arvind Kerjriwal) భారతీయ జనతా పార్టీ (బిజేపీ) అభ్యర్థి పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కేజ్రీవాల్, పర్వేశ్ వర్మ హోరాహోరీ పోటీ నెలకొంది.
ఇక ఇతర నియోజకవర్గాల విషయానికి వస్తే.. జనక్‌పురి నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే, రోహ్తాస్ నగర్, కర్వాల్‌నగర్, లక్ష్మీనగర్ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 15 మంది చొప్పున అభ్యర్థులు ఉన్నారు.
Also Read: కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం!
అత్యల్పంగా.. పటేల్‌నగర్, కస్తూర్బా నగర్ నియోజకవర్గాల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం 70 నియోజకవర్గాలలో 38 నియోజకవర్గాలలో మాత్రమే 10 కంటే తక్కువ మంది పోటీ చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని 70 స్థానాలకు పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో పెట్టింది. అయితే బిజేపీ 68 నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీకి దింపింది, మరో రెండు సీట్లు తన మిత్రపక్షాలు అయిన జేడీ(యూ), ఎల్జేపీలకు కేటాయించింది. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా 69 సీట్లపై పోటీ చేస్తోంది.
ఎన్నికల తేదీలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2025 ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు 2025 ఫిబ్రవరి 8న జరగనుంది.
భారీగా కేసులు నమోదు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 439 కేసులు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కేసులు జనవరి 7 నుంచి 20 వరకు నమోదయ్యాయని వెల్లడించారు. అలాగే, అక్రమ కార్యకలాపాలు, ఆయుధాలు, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మద్యం, డ్రగ్స్ సీజ్
ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో భాగంగా, రూ. కోటి విలువ చేసే 38,075 లీటర్ల మద్యం, 17 కోట్ల విలువైన 104.90 కిలోల డ్రగ్స్, 1200 నిషేధిత ఇంజెక్షన్లు, రూ. 3.55 కోట్ల నగదు మరియు 37.39 కిలోల వెండిని సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజధానిలో ఉద్విగ్నమైన పరిస్థితులను తలపిస్తున్నాయి. అభ్యర్థుల సంఖ్యలో పెరుగుదల, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు, అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయ్.