BJP MP Supreme court| ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ న్యాయవ్యవస్థపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లబడకముందే, భారతీయ జనతా పార్టీ నేత, లోక్‌సభ సభ్యుడు నిశికాంత్ దుబే (Nishikant Dubey) సుప్రీంకోర్టు తీరును విమర్శిస్తూ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చట్టాలు తయారు చేయాల్సింది సుప్రీంకోర్టే అయితే, ఇక పార్లమెంటు భవనాన్ని మూసేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు శాసన అధికారాల్లోకి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. చట్టసభలు చేసిన చట్టాలను కోర్టులు కొట్టివేస్తున్నాయని తెలిపారు. జడ్జీల నియామక హక్కు రాష్ట్రపతికి ఉండగా, ఆ రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తోందని విమర్శించారు.
రాజ్యాంగంలోని అధికరణం 368 ప్రకారం చట్టాలు చేయాల్సిన అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవచ్చు కానీ పార్లమెంటుకు ఇవ్వలేదని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పరోక్షంగా విమర్శిస్తూ.. సుప్రీం కోర్టు వల్ల దేశంలో మతపరమైన యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రారంభమవుతాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్ర గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా.. కోర్టు గవర్నర్, రాష్ట్రపతికి పెండింగ్ బిల్లుల ఆమోదానికి మూడు నెలల సమయం గడవు విధిస్తూ.. ఆదేశించింది. ఆ ఆదేశాలను కూడా ఆయన తప్పుబట్టారు.
ఈ నెల తొలి వారంలో పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై రాజ్యాంగబద్ధతకు సంబంధించి అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై విచారణ జరుగుతున్న సందర్భంలో నిశికాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తడంతో, తదుపరి విచారణ జరిగే వరకు ఆ నిబంధనలను అమలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
Also Read: శవం ముందు ప్రియురాలితో పెళ్లి.. తమిళనాడులో వింత వివాహం
ఇదిలా ఉంటే, రాష్ట్ర గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కూడా వివాదాస్పదంగా మారింది. అయితే, ఈ రెండు అంశాల్లోనూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను విపక్షాలు సమర్థించాయి, కొనియాడాయి. కానీ అధికారంలో ఉన్న బిజేపీ నేతలు మాత్రం తప్పుబడుతున్నారు.
ఎంపీ నిశికాంత్ దుబే చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం: బిజేపీ అధ్యక్షుడు
అయితే బిజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ((Nishikant Dubey)) సుప్రీం కోర్టు గురించి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ట్విట్టర్ ఎక్స్‌లో జేపీ నడ్డా (JP Nadda) ఈ అంశంపై స్పందిస్తూ ఓ పోస్ట్ చేశారు. “భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ న్యాయవ్యవస్థను గౌరవిస్తూ వచ్చింది. కోర్టు తీర్పులను అంగీకరిస్తుంది. కోర్టు ఇచ్చే సూచనలను పరిశీలిస్తుంది. సుప్రీం కోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ కీలక భాగం. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని కాపాడే ఒక పిల్లర్ లాంటిది. బిజేపీ నాయకులను నేను కోర్టులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని సూచించాను. సుప్రీం కోర్టుపై, న్యాయవ్యవస్థపై విమర్శలు చేసిన బిజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, దినేశ్ శర్మల వ్యాఖ్యలను బిజేపీకి సంబంధం లేదు. అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలు. అటువంటి వ్యాఖ్యలను బిజేపీ ఎన్నటికీ సమర్థించదు.” అని నడ్డా తన పోస్ట్ లో రాశారు.