BJP New Chief: బీజేపీ కొత్త అధ్యక్షులు ఎవరు? ఎంపిక విషయం ఎందుకు ఆలస్యమవుతోంది? కొత్త అధ్యక్షుడి విషయంలో ఇటు బీజేపీ, అటు ఆర్ఎస్ఎస్ మల్లగుల్లాలు పడుతోందా? ఈసారి సౌత్ వారికి ఛాన్స్ లేదా? మళ్లీ ఉత్తరాదికే ఆ పదవి వరించనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బీజేపీ కొత్త సారథి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తోంది రాష్ట్రీయ స్వయం సేవక్-RSS. సెప్టెంబరు రెండోవారంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా సెప్టెంబర్ 5 నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు మొదలుకానున్నాయి.
మూడురోజులపాటు జరిగే ఈ సమావేశాలను చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలేతోపాటు ఆర్ఎస్ఎస్ కీలక నేతలు, బీజేపీకి చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించిన తర్వాత అప్పుడు ప్రకటన రావచ్చని కమలం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్ సమన్వయకర్తలు, జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొంటారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్, శివప్రకాష్,సౌదాన్ సింగ్, సతీష్ వంటి నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అంశాలు, దేశ రాజకీయాలు, ఇటీవల అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు సహా అనేక అంశాలపై చర్చించనున్నారు.
ALSO READ: వరకట్న వేధింపులతో భార్య.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో భర్త, అసలేం జరుగుతోంది?
ఇదిలా ఉండగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆగస్టు 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ప్రముఖులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వనున్నారు. 2018 సెప్టెంబర్ తర్వాత విజ్ఞాన్ భవన్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఆ తరహా కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించనుంది.
బీజేపీ అధ్యక్ష పదవి ఈసారి ఉత్తరాది వారికి దక్కనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, వారు ఎన్డీయే కూటమిలో ఉన్నారని అంటున్నారు. తొలుత దక్షిణాదివారికి బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందని బలంగా వార్తలు వచ్చాయి. అయితే ఉపరాష్ట్రపతి రేసులో తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయమని బీజేపీ భావిస్తోంది.
ఇదే సమయంలో బీజేపీ చీఫ్ ఉత్తరాది వారికి ఇస్తే బాగుంటుందని అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాదిలో పార్టీ బలహీన పడితే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారట కమలనాధులు.
బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో కుల సమీకరణాలు, ప్రజాదరణ, రాజకీయ వివరాలను పరిగణనలోకి తీసుకోనున్నారట. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఇదే విధమైన ప్రక్రియను ఉపయోగించారు కమలనాధులు. రాధాకృష్ణన్ పేరు ప్రకటించే ముందు 100 మందికి పైగా వ్యక్తులను సంప్రదించినట్లు బీజేపీలోని ఓ సీనియర్ నేత వెల్లడించారు.
2014 నుండి ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ బీజేపీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఈసారి రెండింటి మధ్య గ్యాప్ కారణంగా ఆర్‌ఎస్‌ఎస్ ఓ అడుగు వెనకేసిందన్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ముందుకు సాగాలంటే 36 రాష్ట్రాలలో కనీసం 19 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించాలని పార్టీ రాజ్యాంగం చెబుతోంది. ఇంకా అధ్యక్షులను నియమించని రాష్ట్రాలు యూపీ, గుజరాత్, కర్ణాటక వంటి కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయని అంటున్నారు.