Delhi News: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా దాడి కేసులో ఏం జరుగుతోంది? ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారా? నిందితుడి ప్లాన్ వేరేగా ఉందా? ఆమెకు జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు 41 ఏళ్ల సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడ్ని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. తొలుత సీఎంను కత్తితో పొడవాలని ప్లాన్ చేసుకున్నాడట నిందితుడు.
ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలని చాలా సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చానని, దాని గురించి ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడట. సీఎం నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లాడట.
న్యాయస్థానం బయట సెక్యూరిటీని చూసి వెనక్కి వచ్చేశాడు. సివిల్ లైన్స్‌లో సీఎం కార్యాలయానికి వెళ్లాడు. తొలుత కత్తితో పొడవాలని ప్లాన్ చేశాడని, భద్రత ఎక్కువగా ఉండడంతో కత్తిని బయట పడేసి లోపలికి ఎంట్రీ ఇచ్చాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: బీజేపీ కొత్త అధ్యక్షులెవరు? ఈసారి ఉత్తరాదికే ఛాన్స్
భారీ భద్రత కారణంగా ఆ ప్లాన్ నుంచి డ్రాపైనట్టు విచారణలో అతడు చెప్పినట్లు తెలుస్తోంది. వీధికుక్కల సమస్యను లేవనెత్తడానికి ముఖ్యమంత్రి ‘జాన్ సున్వై’ కార్యక్రమానికి వెళ్లినట్టు పోలీసులకు చెప్పాడు. దాడికి ముందు ఏదైనా కీలకమైన సమాచారాన్ని అతను తొలగించాడా లేదో తెలుసుకోవడానికి నిందితుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.
ఇదిలాఉండగా ఈ కేసులో మరో నిందితుడు తహసీన్ సయ్యద్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సకారియాకు క్లోజ్ ఫ్రెండ్‌గా గుర్తించారు. దాడి వ్యవహారంలో సకారియాకు సయ్యద్ సహాయం చేసినట్టు తెలుస్తోంది.
కొంత డబ్బు పంపాడని పోలీసుల మాట. దాడికి ముందు సీఎం ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సకారియా తన ఫ్రెండ్ సయ్యద్‌కు పంపించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఆటోరిక్షా డ్రైవర్ సకారియాపై 2017-24 మధ్య రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు కేసులు నమోదు అయ్యాయి. తాడిన మత్తులో దాడి చేయడం వంటివి ఉన్నాయి. ఇవేకాకుండా రకరకాల కేసులు సకారియాపై ఉన్నట్లు తెలుస్తోంది. దాడి ఘటన తర్వాత సీఎం రేఖా గుప్తాకు జడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. అయితే జడ్ కేటగిరీ తొలగించి మునుపటిలాగే భద్రత కల్పిస్తున్నారు ఢిల్లీ పోలీసులు.