Arvind Kejriwal’s Sheesh Mahal: ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఏఏపీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేజ్రీవాల్ కొత్త ఇంటి భవనం డీటేల్స్ బయటపెట్టింది బీజేపీ.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో అధికార ఆప్-బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరి తారాస్థాయికి చేరింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కంచుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు సంధిస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అరవింద్ కేజ్రీవాల్. అధికార నివాసాన్ని ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మాజీ సీఎం బంగ్లా గురించి కొత్త విషయాలు బయటపెట్టింది బీజేపీ. ఇంద్రభవనాన్ని తలపించేలా ముఖ్యమంత్రి బంగ్లాను నిర్మించారు అరవింద్ కేజ్రీవాల్! కేజ్రీవాల్ బంగ్లా లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. అంతేకాదు ఈ బంగ్లాకు సంబంధించి ‘శీష్ మహల్’ పేరిట వీడియో విడుదల చేసింది.
7 స్టార్ రిసార్టును తలపించేలా భవనాన్ని నిర్మించారన్నది బీజేపీ వాదన. సామాన్యుడిని అని చెబుతూ రాజ భవనాలు ఎందుకని గతంలో ప్రశ్నించారు కమలనాథులు. ఢిల్లీని లూటీ చేసి మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన నల్ల ధనంతో ‘శీష్ మహల్’ కట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆరోపించారు.
ALSO READ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఇక లేరు
అరవింద్ కేజ్రీవాల్ విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నారని ఆరోపించింది బీజేపీ. ఇరాక్‌కు చెందిన సద్దాం హుస్సేన్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ భవనాల మాదిరిగా ఆ బంగ్లా ఉందన్నారు. రాజకీయాలతో కెరీర్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్, అధికారిక నివాసాన్ని పునరుద్ధరించడానికి 45 కోట్లు ఖర్చు చేశారంటూ విమర్శలు ఎక్కుపెట్టింది.
తెల్లని స్తంభాలు, పాలరాతి అంతస్తులతో కూడిన బంగ్లాలో మార్బల్ ఫ్లోర్, ఫాన్సీ లైటింగ్, ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయని పేర్కొంది. బీజేపీ బయటపెట్టిన వీడియోపై ఇంకా ఆప్ నేతలు రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో ఆప్ మద్దతుదారులు కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. ప్రధాని మోదీ డ్రెస్సులు, వాహనాలు, విమానం, కొత్త హౌస్ కోసం 500 కోట్లు ఖర్చు చేశారంటూ ఆరోపణలు జోరందుకున్నాయి.
ఇదే సమయంలో గతంలో కేజ్రీవాల్ చేసిన ట్వీట్స్ బయటపెట్టింది బీజేపీ. చాలా మంది ప్రజలు మురికివాడల్లో ఉంటున్నారని, అలాంటిది ఆమె ఇంట్లో 10 ఏసీలు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ను లక్ష్యంగా చేసుకుని 2013లో కేజ్రీవాల్ చేసిన ట్వీట్ బయటపెట్టింది బీజేపీ. మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆప్-బీజేపీ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.
ఇంద్రభవనాన్ని తలపించేలా సీఎం బంగ్లాను నిర్మించిన అరవింద్ కేజ్రీవాల్..!
కేజ్రీవాల్ లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రాలు
'శీష్ మహల్' వీడియో విడుదల చేసిన బీజేపీ
7 స్టార్ రిసార్టును తలపించేలా భవనాన్ని నిర్మించారని.. సామాన్యుడిని అని చెబుతూ రాజభవనాలు ఎందుకని గతంలో ప్రశ్నించిన బీజేపీ… pic.twitter.com/zeVKX8w6YS
— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024