Rahul Gandhi: ఢిల్లీ వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమీషన్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెసేజ్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఓట్ల దొంగతనంపై తీవ్ర ఆరోపణలు
బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరి ఓటును తొలగించారని విమర్శించారు. సామాన్య ప్రజలు చిన్న దొంగతనం చేస్తేనే జైలుకు పంపే మన దేశంలో, కోట్ల మంది ఓటు హక్కును దొంగిలించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞ్యానేష్ కుమార్ జైలుకు పోవడం ఖాయమని అన్నారు.
ప్రధాని మోడీ, అమిత్ షాలకు హెచ్చరిక
రైతులు, కూలీలు, నిరుద్యోగులకు అందాల్సిన ఫలాలను అందించకుండా, బ్యాంకులు లూటీ చేసే వ్యక్తుల చేతుల్లో దేశాన్ని పెట్టారని రాహుల్ విమర్శించారు. ‘మోడీ ఎక్కడికి పోలేరు, మేము పోనివ్వము. జ్ఞ్యానేష్ తర్వాత మోడీ, అమిత్ షాలపై చట్టపరంగా ఫైట్ చేస్తాం. దేశాన్ని అదానీకి అమ్మేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ, అమిత్ షా చేసిన తప్పులకు శిక్ష తప్పదు: రాహుల్ గాంధీ
ఓట్ల చోరీకి పాల్పడి మోడీ, అమిత్ షాలు ఎక్కడికీ పారిపోలేరని, వారిని ఎక్కడికీ వెళ్లనివ్వబోమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరికలు చేశారు. వారి హయాంలో జరిగిన అన్యాయాలు, ఓట్ల చోరీ, దేశ సంపదను అదానీకి కట్టబెట్టడంపై… pic.twitter.com/JLSu2Hq2Qs
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2026
ద్వేషం కాదు.. ప్రేమే మా ఆయుధం
ఈ దేశం ద్వేషంతో కూడుకున్నది కాదని, ప్రేమను పంచే దేశమని గుర్తుచేశారు. ‘మాకు మోడీ, అమిత్ షా, జ్ఞ్యానేష్‌లపై వ్యక్తిగత కోపం లేదు. కానీ మీరు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము. మేము మిమ్మల్ని తిట్టము, కొట్టము.. ప్రేమతోనే సమాధానం చెప్తాం. గాంధీజీ చెప్పినట్లు క్యూ లైన్లలో నిలబడ్డ చివరి వ్యక్తి మాట వినడమే ముఖ్యం’ అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, దేశ ప్రజల గొంతుకను వినిపించడం కోసం మనందరం కలిసి ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిద్దామని రాహుల్ పిలుపునిచ్చారు.
Also Read: బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో మంత్రి లోకేష్.. రాప్తాడు దాడి బాధితురాలికి పరామర్శ