
Corona virus : ప్రపంచ దేశాలను కరోనా మరోసారి కలవర పెడుతోంది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంకా అనేక దేశాల్లో వైరస్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది.
దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ వైరస్ ను ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు తమ దగ్గర ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, నిపుణులతో కరోనా పరిస్థితిపై చర్చించారు. కొవిడ్ నియమావళిని పాటించడం ఎంత ముఖ్యమో.. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడం అంతే ముఖ్యమని సూచించారు. అందరూ ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని కోరారు. రెండో బూస్టర్ డోసు పరిగణనలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో వైద్య నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి రెండో బూస్టర్ అందించాలన్నారు.
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందుకు ఢిల్లీ ప్రభుత్వం ఔషధాల కోసం ముందస్తుగా రూ.104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం మాస్క్‌ను తప్పనిసరి చేసింది. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. చాలా రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను మళ్లీ అమల్లోకి తెచ్చారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ పైనా దృష్టిపెట్టాయి. కరోనా నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తిరుపతిలో నిర్వహించే జల్లికట్టను నిషేధించింది. ఏటా సంక్రాంతి సమయంలో ఇక్కడ జల్లికట్టు ఆడతారు. ఇలా చాలా రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వైద్యసౌకర్యాల పెంపుపై దృష్టిపెడుతున్నారు. కరోనా వైరస్ కేసుల మళ్లీ పెరిగినా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి.