Manipur Violence Soldiers| మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య దాదాపు 18 నెలలకు పైగా హింస జరుగుతూనే ఉంది. ఈ హింసలో ఇప్పటివరకు దాదాపు 258 చనిపోయారు. తాజాగా మణిపూర్ మళ్లీ మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. దీంతో మిలిటెంట్లను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దించబోతోంది. ఇప్పటికే అక్కడ సైనికులు మిలిటెంట్లతో పోరాడుతుండగా.. అదనంగా మరో 10,800 మంది సైనికులు చేరనున్నారు. దీంతో మణిపూర్ చేరిన భారత సైనిక కంపెనీల (సైనికుల సమూహాలు) సంఖ్య 288కి చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలపింది.
90 కంపెనీలకు చెందిన దాదాపు 10,800 కేంద్ర బలగాలు మణిపూర్ కు రవాణా అయ్యాయి. దీంతో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులో పెట్టడానికి మొత్తం 288 కంపెనీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మణిపూర్ భద్రతా సలహాదారుడు కుల్దీప్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఆయన మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. “90 కంపెనీల అదనపు బలగాలు మణిపూర్ కు చేరనున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే రాజధాని ఇంఫాల్ చేరుకున్నాయి. మణిపూర్ లో పౌరుల ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడానికి బలగాలను అన్ని ప్రాంతాల్లో మోహరిస్తున్నాం. మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి. ప్రతి జిల్లాలో కొత్త కో ఆర్డినేషన్ సెల్స్, జాయింట్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే అందుబాటులో ఉన్న కంట్రోల్ రూమ్స్ ను కూడా సమీక్షించడం జరిగింది.
Also Read: అదానీ అవినీతిలో ప్రధాని మోడీ భాగస్వామ్యం.. రాహుల్ ఆరోపణలు.. మండిపడిన బిజేపీ
మణిపూర్ లో శాంతి స్థాపనకు కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), సైన్యం, అస్సాం రైఫిల్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సహస్త్ర సీమా బల్ లాంటి అన్ని బలగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మే 2023లో కుకీ, మేటీ తెగల మధ్య మొదలైన సాయుధ పోరాటంలో ఇప్పటివరకు 258 మంది చనిపోయారు. పోలీస్ స్టేషన్ల నుంచి దోపిడీకి గురైన దాదాపు 3000 ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. మణిపూర్ లో ఏ సమస్య వచ్చినా అన్ని బలగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మిలిటెంట్లను అడ్డుకోవడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తాం. ముఖ్యంగా జాతీయ రహదారులు, కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.” అని ఆయన అన్నారు.
18 నెలలుగా చెలరేగుతున్న ఈ హింసలో నవంబర్ 7, 2024న జిరిబాబ్ ప్రాంతంలోని జాయిరాన్ గ్రామంలో ముగ్గరు పిల్లల తల్లిని మేటీ తెగ మిలిటెంట్లు హత్య చేయడంతో సమస్య మళ్లీ తీవ్రమైంది. దీనికి సమాధానంగా కుకీ తెగకు చెందిన దాదాపు 25 మిలిటెంట్లు జిరిబాబ్ లోని బోరోబేక్రాపై నవంబర్ 11న దాడిచేశారు.
దీంతో ఆ ప్రాంతంలోని సిఆర్‌పిఎఫ్ జవాన్లతో కుకీ మిలిటెంట్లు తలపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ 10 మంది మిలిటెంట్లు చనిపోగా.. మిగతా వారు ఒక మెటీ తెగకు చెందిన కుటుంబాన్ని బందీగా చేసుకొని తప్పించుకున్నారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు వృద్ధ మేటీ పౌరులను కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. బందీగా ఉన్న కుటుంబంలోని ఆరుగురు సభ్యుల శవాలు సమీపంలోని ఒక నదిలో లభించాయి.