Gukesh Tax : ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దొమ్మరాజు గుకేష్ కు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో అతిపిన్న వయస్సులోనే చెస్ టైటిల్ గెలిచి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కుర్రాడిపై పన్నుల భారం వేయకూడదని ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలిపిన ఈ కుర్రాడి విషయంలో కేంద్రం సానుకూలంగా వ్యవహరించనుందని.. జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.
చైనా చెస్ క్రీడాకారుడు డింగ్ లెరిన్ ను ఉత్కంఠ పోరులో ఓడించి.. ఈ నెల 12న వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో అతిపిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అంతర్జాతీయ చెస్ టైటిల్ గెలవడంతో.. అతనికి ప్రైజ్ మనీగా రూ.11.45 కోట్ల రూపాయలు అందాయి. పోటీల్లోని విభాగాల్లో విడివిడిగా గెలిచిన సొమ్ముతో పాటు చివరి మ్యాచ్ లో టైటిల్ గెలుపొందడంతో మొత్తంగా ఈ సొమ్ములు అతనికి దక్కాయి.
తమిళనాడుకు చెందిన గుకేష్ సాధించిన విజయాని మెచ్చుకుంటూ స్టాలిన్ ప్రభుత్వం గుకేష్ ను సన్మానించింది. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.5 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. దీంతో.. వరల్డ్ ఛాంపియన్ అయిన గుకేష్ ఏకంగా రూ.16.45 కోట్ల మేర ప్రైజ్ మనీ రూపంలో సాధించినట్లైంది.
పన్నులకే అధిక మొత్తం
ప్రైజ్ మనీ అయితే గెలిచాడు కానీ.. అందులో అధిక మొత్తం ఆదాయ పన్ను రూపంలోనే చెల్లించాల్సి రావచ్చనే కథనాలు వెలువడ్డాయి. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికపై చాటిన కుర్రాడిపై ఈ తీరుగా అధిక పన్నులు విధించడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇదే విషయమై సోషల్ మీడియాలోనూ అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి.. గుకేష్ ఆదాయంపై 42.5 శాతం పన్నుల విభాగంలోకి వస్తాయి. ఈ లెక్కలో మొత్తంగా గుకేష్ ఆదాయంపై రూ.6.23 కోట్ల వరకు పన్నులకే పోనున్నాయి. దీంతో.. అతనికి చివరిగా రూ.10.22 కోట్లే మిగలనున్నాయి. దీంతో.. గుకేష్ చెస్ ఛాంపియన్ గెలిచి సాధించిన ప్రైజ్ మనీ కంటే.. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగానే ఎక్కువ పన్నుల రూపంలో రాబట్టారు అంటూ వ్యంగంగా పోస్టులు చాలా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే.. విషయం కేంద్రం దృష్టికి వెళ్లిందని తెలుస్తోంది. గుకేష్ ప్రైజ్ మనీ విషయమై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు.
ప్రధాని మోదీ ప్రశంసలు
గుకేష్ సాధించిన విజయం చిన్నది కాదు. అంతర్జాతీయ వేదికపై.. ఇతర దేశాలకు చెందిన పేరున్న క్రీడాకారుల్ని తన ఎత్తులతో చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో.. రాష్ట్రపతి వంటి ప్రముఖుల నుంచి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు అంతా ప్రశంసలు కురిపించారు. చెస్ రంగంలో గుకేష్ విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సైతం గుకేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇదే సందర్భంలో గుకేష్ పై పన్నుల భారం పడకుండా చూడాలని ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో.. నిర్మలా సీతారామన్ ఆదేశాలతో గుకేష్ గెలుచుకున్న ప్రైజ్ మనీపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఇస్తూ.. ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించగా.. అధికారికంగా ఉత్తర్వులు వెలువడడమే మిగిలుంది.