Ration Cards: రేషన్ కార్డుల వ్యవస్థలో కీలక మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అసలైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఆహార ధాన్యాలు అందేలా చూడనుంది. అందుకోసం పీడీఎస్ డేటాబేస్‌ను కచ్చితంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలలుగా రేషన్ కార్డ్ ద్వారా బియ్యం, ఇతర వస్తువులు తీసుకోని రేషన్ కార్డులను నిలిపి వేయాల డిసైడ్ అయ్యింది. ఆ లెక్కన దేశ వ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులను అక్టోబర్ నుంచి తాత్కాలికంగా నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది.
లబ్దిదారుల పేర్లను ప్రభుత్వ డేటా బేస్ నుంచి తొలగించదు. వారికి మూడు నెలల సమయం ఇవ్వనుంది. ఈ సమయంలో లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. తాము అర్హులమని నిరూపించుకుంటే కార్డుని యాక్టివేట్ చేస్తుంది. దీనిద్వారా రేషన్ సరుకులు అవసరమైన కుటుంబాలకు చేరనున్నాయి. పీడీఎస్‌లోని యాక్టివ్గా కార్డులను గుర్తించి డేటాబేస్ రెడీ చేయాలని భావిస్తోంది. ఈ విషయం తెలియగానే ఈ విధానంపై కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ తీసుకోని కారణం తెలుసుకోకుండా కార్డును ఆపివేయడం వల్ల నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు. సాంకేతిక సమస్యలు, వలసలు వంటి కారణాలతో కొందరు లబ్ధిదారులు రేషన్ తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వారి రేషన్ కార్డులు రద్దు చేస్తే లబ్దిదారులు తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. రేషన్ ఎవరు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు అంచనా వేయడం ముఖ్యమని, పంచాయతీ స్థాయిలో కమిటీల ద్వారా ఈ ప్రక్రియలో చేయాలని అంటున్నారు.
ఒక వ్యక్తి సాంకేతిక అడ్డంకుల వల్ల, రేషన్ డీలర్‌తో ఉన్న సమస్యల కారణం, వలస వెళ్లడం, మరణం వల్ల రేషన్ తీసుకోవడం ఎందుకు నిలిపివేశాడో ఆయా కమిటీలు నిర్ధారణ చేయాలని అంటున్నారు. ప్రభుత్వం గతంలో PDS డేటాబేస్‌ను శుభ్రపరచడానికి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఇ-కేవైసీలను ఉపయోగించింది. నవంబర్ 2024లో ఆహార మంత్రిత్వ శాఖ ఇలాంటి చర్యల ద్వారా PDS వ్యవస్థ నుండి సుమారు 5.8 కోట్ల రేషన్ కార్డులను తొలగించినట్లు తెలుస్తోంది. అర్హులైన వ్యక్తులు మాత్రమే కవరేజీలో ఉండేలా చూడటమే లక్ష్యంగా అభివర్ణించింది.
ALSO READ: జవాన్ల మధ్య అంతర్గత కలహాలు.. నలుగుర్ని కాల్చి చంపిన మరొక జవాన్, జమ్మూకాశ్మీర్‌లో దారుణం
రేషన్ కార్డుల డేటాబేస్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం ఇ-కేవైసిని ఓ సాధనంగా ప్రోత్సహిస్తోంది కేంద్రం. ఆహార శాఖ డేటా ప్రకారం.. జూలై 30 నాటికి ఇ-కేవైసి కవరేజ్ 90.64 శాతం ఉంది. ఇ-కేవైసి ఆధారిత డేటా రెప్లికేషన్, మొబైల్ నంబర్ సీడింగ్ కోసం ఒక కొత్త ప్రోటోకాల్ ప్రవేశపెట్టినట్లు ఆ శాఖ తెలిపింది.