Women-Managed Railway Station: రైల్వే స్టేషన్ అంటే సాధారణంగా టికెట్ కౌంటర్ దగ్గర సిబ్బంది, ప్లాట్‌ఫామ్‌పై రైల్వే ఉద్యోగులు, భద్రత కోసం పోలీసులు.. ఇలా చాలామంది కనిపిస్తారు. కానీ, ఒక రైల్వే స్టేషన్‌లో మాత్రం ఈ బాధ్యతలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. టికెట్లు ఇవ్వడం నుంచి రైళ్ల నిర్వహణ వరకు.. ప్రయాణికుల భద్రత నుంచి స్టేషన్ పరిశుభ్రత వరకు ప్రతి పనినీ మహిళలే చూసుకుంటారు. అదే ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్.
ముంబైలో ఉన్న మాతుంగా రైల్వే స్టేషన్ 2017లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. పూర్తిగా మహిళా సిబ్బందితో నిర్వహించబడుతున్న రైల్వే స్టేషన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్ నిర్వహణలో మహిళలు అన్ని కీలక బాధ్యతలు తీసుకున్నారు.
మాతుంగా స్టేషన్ ప్రత్యేకత కేవలం టికెట్ కౌంటర్లకే పరిమితం కాలేదు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడం, అనౌన్స్ మెంట్లు చేయడం, రైళ్ల రాకపోకలకు సంబంధించిన విధుల్లో భాగస్వామ్యం కావడం లాంటి అనేక బాధ్యతలను మహిళా సిబ్బంది నిర్వహించారు. స్టేషన్ భద్రత విషయంలోనూ మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)కు సంబంధించిన బాధ్యతల్లో కూడా మహిళలు ఉన్నారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచే పనుల్లోనూ మహిళా సిబ్బందే ముందున్నారు.
మాతుంగా మాటుంగా రైల్వే స్టేషన్‌లో సుమారు 41 మంది మహిళా సిబ్బంది కలిసి విధులు నిర్వహించారు. స్టేషన్ మేనేజర్‌గా మమతా కులకర్ణి వ్యవహరించిన సమయంలో ఈ స్టేషన్ మహిళా ఉద్యోగుల సమష్టి నిర్వహణకు ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. ఒక స్టేషన్‌ను సజావుగా నడిపించడానికి అవసరమైన వివిధ పనులను మహిళలు సమర్థంగా నిర్వహించగలరనే విషయాన్ని ఈ స్టేషన్ నిరూపించింది.
మాతుంగా రైల్వే స్టేషన్‌కు లభించిన మరో ప్రత్యేక గుర్తింపు లిమ్కా బుక్ ఆఫ్ రికార్ట్స్ లో చోటు దక్కడం. పూర్తిగా మహిళా సిబ్బందితో నడిచే రైల్వే స్టేషన్‌గా ఈ ఘనత నమోదు కావడం అప్పట్లో ప్రత్యేకంగా గుర్తించబడింది. దీంతో మాతుంగా పేరు రైల్వే వ్యవస్థలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచింది.
రైల్వేలు అంటే కేవలం రైళ్లను నడపడం మాత్రమే కాదు. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులతో ముడిపడి ఉండే భారీ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఒక స్టేషన్‌కు సంబంధించిన దాదాపు అన్ని బాధ్యతలను మహిళలు నిర్వహించడం ప్రత్యేకమైన విషయం. ఒకప్పుడు కొన్ని ఉద్యోగాలు పురుషులకే పరిమితమనే భావన ఉన్న సమయంలో.. రైల్వే స్టేషన్ నిర్వహణలోనూ మహిళలు ముందుంటారని ఈ రైల్వే స్టేషన్ చూపించింది. అందుకే, ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ కేవలం రైళ్లు ఆగే ప్రదేశం మాత్రమే కాదు.. మహిళల సామర్థ్యాన్ని చాటిచెప్పిన ప్రత్యేకమైన స్టేషన్ గా చరిత్రలో నిలిచిపోయింది.
Read Also: సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!