Etala Rajender: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో మంగళవారం ఎంపీ అర్వింద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి ఈటల మీడియా సమావేశం నిర్వహించారు.
రాజేందర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని.. ఢీకొట్టడం.., రాహుల్ గాంధీ కాదు కదా.. ఆయన జేజమ్మ దిగి వచ్చినా వారి వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ పై చేస్తున్న ఉద్యమంతో భారతదేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ పిచ్చి పనులు మానుకోకపోతే కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. కాంగ్రెస్.. దేశ ప్రజల సమస్యలను ప్రస్తావించి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని, అసహనంతో అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్ల క్రితం ఓటర్ జాబితాను సరిచేయాలని డిమాండ్ చేసిందే రాహుల్ గాంధీ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది కొత్తది కాదని, నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
గెలిస్తే ఒక పాట ఓడిపోతే మరొక పాట..
గెలిస్తే ఒక పాట ఓడిపోతే మరొక పాట పాడటం కాంగ్రెస్ అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత తమిళనాడులో విజయ్ గెలిచారని, కేరళలో గెలిచింది కాంగ్రెస్ గెలిచిందని ఆయన గుర్తుచేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని, ఎస్ఐఆర్ ద్వారా చనిపోయిన వారి ఓట్లను తొలగించినందుకు ఆయన రాజీనామా చేయాలా? అని ఈటల ప్రశ్నించారు. చరిత్రలో ఎలక్షన్ కమిషన్ ను అత్యధికంగా మిస్ యూస్ చేసిన పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు.
Also Read: టారిఫ్‌ల దెబ్బకు దిగొచ్చిన ఎస్సార్? అమెరికాలోనే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు!