Jammu kashmir: జమ్మూకాశ్మీర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జవాన్ల మధ్య అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. దీన్ని తట్టుకోలేని ఓ జవాన్, సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. అందులో ఓ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఈ ఘటన సీఐఎస్ఎఫ్ విభాగంలో తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?
జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో సేవా జలవిద్యుత్ కేంద్రం వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. మృతులలో ఒక అసిస్టెంట్ కమాండెంట్ ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, ఎస్ఐ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ అభిదేశ్ కుమార్ తన సహచరులతో వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరగడంతో తనవద్ద నున్న సర్వీస్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ చనిపోయారు. హెడ్ కానిస్టేబుల్ అభిదేశ్ కుమార్ సింగ్.. తన వద్ద ఉన్న ఏకె 47 రైఫిల్‌తో 150 రౌండ్ల మందుగుండు సామగ్రిని ఉపయోగించి కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి , తవిచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిందితుడు అభిదేశ్ 2009 బ్యాచ్‌కు చెందినవాడు.
ఈ ఘటనతో ఒక్కసారిగా సీఐఎస్ఎఫ్ కార్యాలయం ఉలిక్కిపడింది. దీని గురించి తెలియగానే విచారణకు కోర్టును ఏర్పాటు చేయాలని సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం ఆదేశించింది. ఘటన గురించి తెలియగానే స్థానిక పోలీసులు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడు అభిదేశ్ కుమార్ సింగ్‌ను అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. బసోహ్లి తహసీల్‌లోని రావి నదిపై సేవా-3 జల విద్యుత్ ప్రాజెక్టు 1993లో ప్రారంభించారు.
ALSO READ: రూ.3 వేల మందుకు రూ. 27 వేలా? కేంద్రంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
2013 నాటి వరదల్లో ఈ ప్రాజెక్టు దాదాపు 300 మీటర్ల భాగం కొట్టుకుపోవడంతో దాన్ని పూర్తిగా మూసివేశారు. ఆ తర్వాత దాన్ని తెరిచి దాని బాధ్యతలను సీఐఎస్ఎఫ్ విభాగానికి అప్పగించారు. ఇదిలావుండగా అక్టోబర్ 2021లో కేంద్ర భద్రతా దళ సిబ్బంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం, చంపడం వంటి ఘటనల వెనుక గల కారణాలను దర్యాప్తు చేయడానికి హోంమంత్రిత్వ శాఖ ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగులకు సెలవులు లేకపోవడం వల్ల కలిగే మానసిక క్షోభ, పని ప్రదేశంలో ఒత్తిడి వంటి కారణాలు వెల్లడయ్యాయి.