Union budget 2024-25 updates(Telugu news headlines today): దేశంలోని వృద్ధ పౌరులకు సమాజంలో ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం కొన్నేళ్ల క్రితం ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం.. 60 ఏళ్లు దాటిన పౌరులు తమ ఆదాయంలో నుంచి కొంత ఈ పథకంలో సేవింగ్స్ రూపంలో దాచుకుంటే.. ఆ మొత్తాన్ని బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు ప్రతి నెలా పెన్షన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. తాజాగా ఈ పరిమితి రెట్టింపు అంటే రూ.10000 వరకు చేయబోతోందని సమాచారం.
రేపు (జూలై 2023) పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ లో అటల్ పెన్షన్ యోజన లో కనీస గ్యారెంటీ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశముందని ఎకనామిక్ టైమ్స్ లో వార్త ప్రచురితమైంది.
అటల్ పెన్షన్ యోజనలో మరిన్ని మార్పులు
జూన్ 20, 2024న అటల్ పెన్షన్ యోజన పథకంలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 66.2 మిలియన్లు (6 కోట్ల 62 లక్షలు) ఉన్నారు. ఇందులో 12.2 మిలియన్ల (కోటి 22 లక్షల) మంది కేవలం 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా నమోదు చేసుకున్నవారున్నారు. జాతీయ మీడియా అందించిన నివేదికల ప్రకారం.. ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా ఈ పథకంలో మరిన్ని మార్పులు తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ పథకం కేంద్ర సంస్థ పెన్షన్ ఫండ్ రెగులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ ఆర్ డిఏ) ఆధ్వర్యంలో నడుస్తోంది. పిఎఫ్ ఆర్ డిఏ సంస్థ చైర్మెన్ దీపక్ మొహంతీ మాట్లాడుతూ.. పెరిగిపోతున్న ధరలు, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ పథకంలో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవసరముందని అన్నారు.
ఆర్థికంగా ఏ ఆదాయం లేని వృద్ధులకు సాయంగా
పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఈ పథకం బాగా ఉపయోగపడుతోందని.. కేంద్రం ఏ ఉద్దేశంతో అటల్ పెన్షన్ యోజన ప్రారంభించిందో అది విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు చెప్పారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పి ఎస్) లో భాగంగా ప్రారంభమైన అటల్ పెన్షన్ యోజన లో చందాదారులు 60 ఏళ్ల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులకు ఈ పథకంలో చేరే అర్హత లేదు. కేవలం అర్థికంగా వెనబడినవారికి మాత్రమే ఈ పథకం లాభాలు అందుతాయి. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగించే పౌరులు ఈ పథకంలో చేరవచ్చు. పథకంలో చేరిన వారికి.. వారి సేవింగ్స్ బట్టి 60 ఏళ్లు దాటిన తరువాత ప్రతినెలా రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000.. గరిష్ఠంగా రూ.5000 ప్రభుత్వం చెల్లింస్తుంది.
అటల్ పెన్షన్ యోజన పథకంలో కనీస పెన్షన్ మొత్తం ప్రభుత్వం ఇచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన ఆదాయం లోనుంచి అనుకున్న డిపాజిట్ చేయాల్సిన మొత్తంలో కొంత తక్కువ డిపాజిట్ చేసినా… ప్రభుత్వం ఆ లోటు భర్తీ చేస్తుంది. మరోవైపు చందాదారుడు డిపాజిట్ చేసిన మొత్తం చెప్పిన దాని కంటే ఎక్కువ ఉంటే.. ఆ ఎక్కువగా మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చందాదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం వృద్ధ పౌరులకు వీలైనంత ఎక్కువ మందికి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన విజయవంతంగా పనిచేస్తోంది.