Phalgam Attack Poniwala| జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. 26 కుటుంబాల్లో చెప్పలేని విషాదాన్ని నింపింది. వీరిలో ఒక జంట అక్కడికి హనీమూన్ కోసం వెళ్లగా.. ఒక జంటకు పెళ్లిరోజు. మరి కొందరు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. వారందరూ జీవతం ఎంతో సుఖంగా గడపాలని కోరుకున్నారు.. కానీ, ఉగ్రవాదుల ఘాతుకానికి అది కలగానే మిగిలిపోయింది. పర్యాటకులను ఒక్కొక్కరినీ పేరు, వివరాలు అడిగి, ఆధార్ కార్డులు చూపించాలని చెప్పి, ఖురాన్ వచనాలు చదవమంటూ, తర్వాత వారిని కాల్చి చంపిన విధానం హృదయాలను కలచివేస్తోంది.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు తప్ప అందరూ హిందువులే. మృతుల్లో మహారాష్ట్ర నుంచి ఆరుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, గుజరాత్‌కు చెందిన వారు ముగ్గురు, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, ఒక స్థానికుడు కూడా ఉగ్రదాడిలో మరణించారు.
ఆ స్థానికుడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. 30 ఏళ్ల ముస్లిం యువకుడు. స్థానిక పోనీవాలా అంటే పర్యాటకులకు పొట్టి గుర్రాలపై షికారు చేయించేవాడు. ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారితో వీరోచితంగా పోరాడిన ఏకైక వీరుడు ఇతనే. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు తుపాకుల లాక్కోవాలని ప్రయత్నించాడు. ఫలితంగా అతడిని కూడా ఉగ్రవాదులు నిర్దయగా కాల్చి చంపారు. ఆదిల్ ని మాత్రమే అతని గుర్రాలు.. ఆ మూగజీవాలపై కూడా ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు.
ఆదిల్ చేసిన సాహసకార్యాన్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. బుధవారం దక్షిణ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఆదిల్ అంత్యక్రియలు జరిగాయి. ఆ అంతక్రియల కార్యక్రమంలో సిఎం అబ్దుల్లా పాల్గొని ఆదిల్‌కు నివాళులు అర్పించారు. ఆదిల్ లాంటి ముస్లింలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఆదిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
చనిపోయిన వారిలో..
తన భార్యతో కలిసి హార్స్ రైడింగ్‌కు బయటకు వచ్చిన సమయంలో కాల్పులకు బలైన వ్యక్తిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యాపారవేత్త శుభం ద్వివేది కూడా ఉన్నాడు. ఇటీవలే ఫిబ్రవరిలో ఆయనకు పెళ్లి అయ్యింది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది వంటి కుటుంబ సభ్యులతో కలిసి బైసారన్‌కు వెళ్లారు. మంగళవారం కుటుంబ సభ్యులు హోటల్‌లో ఉన్నప్పుడే, శుభం తన భార్యతో కలిసి హార్స్ రైడింగ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అతనిని అడిగి, ఖురాన్ వచనాలు చదవమన్నారు. ఆయన అంగీకరించకపోవడంతో నేరుగా తలపై కాల్చి, భార్య కళ్లముందే చంపేశారు.
కేరళలోని ఎడప్పల్లికి చెందిన 65 ఏళ్ల రామచంద్రన్ కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. పర్యటనకు మక్కువ ఉన్న ఆయన తన భార్య, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ వారి కళ్లముందే ఉగ్రవాదులు రామచంద్రన్‌ను కాల్చారు. ఆయనను కూడా ఖురాన్ వచనాలు చదవమని అడిగినప్పుడు, తాను ముస్లింకాదని చెప్పడంతో వెంటనే కాల్చేశారు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త దినేశ్ మిరానియా తన పెళ్లిరోజును ఆనందంగా జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి పహల్గాం వచ్చాడు. కానీ అక్కడే భార్య మరియు పిల్లల కళ్లముందే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు.
ఒడిశాకు చెందిన 41 ఏళ్ల ప్రశాంత్ సత్పతి కశ్మీర్ వెళ్లాలన్న కలను నెరవేర్చుకోవడానికే నెలల తరబడి డబ్బు కూడబెట్టాడు. చివరికి బైసారన్ చేరుకున్నాడు. అయితే అక్కడే భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే ఏమీ చేయలేని స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.