IPL Teen Murder| ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అదే విధి. తాజాగా ఒక అనూహ్య ఘటన జరిగింది. ప్రపంచమంతా ఐపిఎల్ క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఒక ఇంట్లో మాత్రం ఆ ఐపిఎల్ ఉత్సాహమే ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మీరట్ జిల్లా ఖజురీ గ్రామానికి చెందిన సలీం (పేరు మార్చబడినది) అనే 13 ఏళ్ల బాలుడు గత శనివారం రాత్రి ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా బంధువుల పెళ్లికి వెళ్లారు. కానీ సలీం మాత్రం తాను ఐపిఎల్ మ్యాచ్ మిస్ చేయలేనని చెప్పి మొండిగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో సలీం ఇంట్లో మ్యాచ్ చూడడానికి పక్కింట్లో నివసించే మొహమ్మద్ కైప్ అనే 18 ఏళ్ల యువకుడు కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: విహార యాత్రకు వెళ్లిన ఫ్యామిలీకి ప్రమాదం.. ఆంబులెన్స్‌కు రూ.70 లక్షలు ఖర్చు.. ఎలా జరిగిందంటే?.
ఈ క్రమంలో వారు తమ ఆనందాన్ని రెట్టింపు చేయాలనుకున్నారు. ముఖ్యంగా సలీంకు టపాసులు పేల్చడమంటే ఇష్టం. కానీ ఆ సమయంలో టపాసులు లేవు. అయితే అతని ఒక ఐడియా వచ్చింది. తన తండ్రికి చెందిన తుపాకీ ఇంట్లో ఉంది. దాన్ని పేలుద్దామని అనకున్నాడు. కానీ మొహమ్మద్ కైఫ్ అలా చేయడం ప్రమాదకరమని హెచ్చరించాడు. అయినా అతని మాటలు లెక్కచేయని సలీం వెంటనే తన తండ్రి గదిలోకి వెళ్లి.. ఆయన భద్రంగా దాచిన తుపాకీని తీసుకొచ్చాడు.
కానీ అది సేఫ్టీ లాక్ ఉండడం వలన సలీం దాన్ని పేల్చలేకపోయాడు. దాంతో కైఫ్.. సలీంని వెక్కిరిస్తూ నవ్వాడు. అంతే సలీంకు కోపం వచ్చింది. దాన్ని ఎలాగైనా కాల్చి చూపాలని పదే పదే ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ తుపాకీ పేలింది. కానీ ఎదురుగా ఉన్న కైఫ్ కు ఆ తుపాకీలోని బుల్లెట్ తగిలింది. కైఫ్ ఛాతీ భాగంలో బుల్లెట్ దూసుకుపోవడంతో అతను స్పాట్ లో మృతి చెందాడు. మరోవైపు సలీంకు కూడా తుపాకీ పేలడం చేతికి గాయమైంది. ఆ తరువాత కైఫ్ పరిస్థితి చూసి సలీం స్పృహ కోల్పోయాడు. రాత్రి 12 గంటల తరువాత సలీం తల్లిదండ్రులు పెళ్లి నుంచి తిరిగి వచ్చాక ఇంట్లో చూస్తే.. సలీం, కైఫ్ ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు.
ఈ షాకింగ్ దృశ్యం చూసిన సలీం తండ్రి వెంటనే పోలీసులకు, ఆంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. అయితే పోలీసులు కైఫ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. సలీం చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తరువాత మృతుడు మొహమ్మద్ కైఫ్ తండ్రి.. సలీం, అతని కుటుంబంపై కేసు నమోదు చేశాడు. నిర్లక్ష్యంగా తుపాకీ ఇంట్లో పెట్టినందుకు సలీం తండ్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే పోలీసులు సలీం తండ్రి వద్ద తుపాకీ లైసెన్స్ ఉందని.. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని ప్రాథమిక విచారణలో తేల్చారు. కానీ సలీం తండ్రి ఇంట్లో తుపాకీ భద్రంగా పెట్టడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కోర్టు కేసు స్వీకరించే అవకాశాలున్నట్ల తెలుస్తోంది.