CM Mamata Banerjee| పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 25 వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఆ టీచర్లకు అండగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలబడ్డారు. వారికేం భయం లేదని.. తాను ఉన్నానని హామీ ఇచ్చారు. అాలాగే వైద్య విద్య కోర్సు కోసం ప్రవేశ పరీక్ష అయిన నీట్ ప్రక్రియ పైనా ఆమె విమర్శలు చేశారు.
సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులతో సోమవారం నేతాజీ ఇండోర్ స్టేడియంలో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీట్ ప్రవేశ పరీక్ష పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘విద్యా వ్యవస్థను ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. ఒకవేళ అలా ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? అనే విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇవ్వాలి. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో వ్యాపం కేసులో పలువురి ప్రాణం పోయింది. వాళ్లకు ఇప్పటిదాకా న్యాయం జరగలేదు.
నీట్ ప్రవేశ పరీక్షపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ పరీక్షను సుప్రీం కోర్టు రద్దు చేయలేదు. అలాంటప్పుడు బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎందుకు? ఇక్కడి మేధస్సును భయపెట్టాలనుకుంటున్నారా? దీనికి సమాధానం కావాలి’’ అని మమతా అన్నారు.
‘‘ఈ విషయాలపై సుప్రీం కోర్టు ఒక స్పష్టత ఇస్తే.. మేము రుణపడి ఉంటాం. ఒకవేళ ఇవ్వకుంటే.. మీకు అండగా ఎలా నిలబడాలో అందుకోసం ప్రత్యామ్నాలు చూస్తాం. రెండు నెలలుగా మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసు. అలాగని మిమ్మల్ని 20 ఏళ్ల పాటు బాధపెట్టాలనే ఉద్దేశం మాకు లేదు. ఈ రెండు నెలలకు కూడా మీకు పరిహారం చెల్లిస్తాం.
మా గుండె బండరాయేం కాదు. ఈ నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని మీరు భావించొద్దు. ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ అదేం పట్టించుకోను. కొందరు చేసిన తప్పులకు మీ జీవితాలను బలికానివ్వం. నాలో ఊపిరి ఉన్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పడనివ్వను. మూడు నెలల్లో నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఈ వ్యవహారంపై స్పష్టత కోరాం. ఆ స్పష్టత రాగానే తీర్పుపై రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. మీకు ఇంకా ఉద్యోగాల నుండి తొలగించినట్లు లేఖలు రాలేదు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. మీ ఉద్యోగాలకు మాది భరోసా. నా శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు రోడ్డున పడే దుస్థితి మీకు రానివ్వను’’ అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగంగా ప్రసంగించారు.
Also Read: ఇంకా ఏడుపెందుకు? మోదీ నోట అలాంటి మాట!
అంతకు ముందు, సుప్రీం కోర్టు తీర్పునకు ప్రభుత్వ పరంగా కట్టుబడి ఉంటామన్న ఆమె, వ్యక్తిగతంగా మాత్రం అంగీకరించబోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విపక్ష బీజేపీ, సీపీఎంలపైనా ఆమె విరుచుకుపడ్డారు. ఇది తమ ప్రభుత్వంపై దాడి అనే కోణంలో ఆమె మాట్లాడారు. ‘‘నన్ను టార్గెట్ చేసి.. ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీచర్ల ఉద్యోగాలను లాక్కోవాలని చూడకండి. గాయపడిన పులి మరింత ప్రమాదకరమైంది. గుర్తుంచుకోండి’’ అని విపక్షాలకు హెచ్చరిక జారీ చేశారు.
అంతకు ముందు కోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు మాట్లాడుతూ.. తాము రివ్యూ పిటిషన్ వేయబోతున్నామని, ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం, స్కూల్ సర్వీస్ కమిషన్ తమతో కలిసి రావాలని కోరారు.
2016లో జరిగిన 25 వేల టీచర్ల, నాన్-టీచింగ్ స్టాఫ్ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో కొంతమంది హై కోర్టును ఆశ్రయించారు. కలకత్తా హైకోర్టు ఈ కేసు విచారణ చేసి నియామకాలను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. అయితే హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. కలకత్తా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏప్రిల్ 3వ తేదీన మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
‘‘ఈ నియామకాలు మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోం’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.
అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘‘కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటి?’’ అని మమతా బెనర్జీ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.