Delhi CM Race: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది బీజేపీ. దీంతో ఆ పార్టీలో ఆనందాలను అవధుల్లేకుండా పోయింది. విక్టరీ సెలబ్రేషన్స్‌ని అర్థరాత్రి వరకు ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు చేసుకున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక్కడివరకు ఓ అంకం పూర్తి అయ్యింది. అసలు అంకం ఇప్పుడే మొదలైంది.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అరడజను మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పుత్రరత్రాలు, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సైతం ఈ రేసులో ఉన్నారు. కాకపోతే బీజేపీ హైకమాండ్ దీనిపై ఏ మాత్రం నోరు విప్పలేదు. జరుగుతున్న పరిణామాలు, నేతల మాటలను క్షుణ్ణంగా గమనిస్తోంది.
బీజేపీ తరపున తొలి ఢిల్లీ సీఎం మదన్ లాల్ ఖురానా. ఈయన రెండేళ్లకు పైగానే పాలించారు. ఆ తర్వాత సాహిబ్‌సింగ్ వర్మ చేతిలో వెళ్లింది. ఆయన కూడా రెండున్నరేళ్లు రూలింగ్ చేశారు. ఆ తర్వాత సుష్మాస్వరాజ్ దాదాపు రెండునెలలపాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రుల పుత్రరత్నాలు ఢిల్లీ పీఠంపై కన్నేశారు. ఎవరికివారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు.
బీజేపీలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం అంటే ఆశామాషీ కాదు. కిందిస్థాయి నుంచి హైకమాండ్ వరకు ఎన్నోవిధాలుగా వడపోసి పోసి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అందుకే ఎన్నికల ముందు సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని అస్సలు ప్రస్తావించదు. అలా చేస్తే.. నేతల మధ్య విభేదాలు పొడచూపి, అసలకే ఎసరు వస్తుందన్నది ఆ పార్టీ ఆలోచన.
ALSO READ: లిక్కర్ స్కామ్.. జైలుకెళ్లొచ్చిన ఆప్ అగ్రనేతల కొంపముంచిందా?
యూపీలో బీజేపీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం భారీగా కసరత్తు చేసింది. చివరకు యోగిని నిలబెట్టింది. అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేశారు. సక్సెస్ కొట్టారాయన. ఇప్పుడూ అదే ఫార్ములాను అనుసరించాలన్నది బీజేపీ ఆలోచన. ఈ క్రమంలో కొందరు పరిశీలకులను రెడీ చేస్తోంది. రేపో మాపో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో పరిశీలకులు సమావేశం కానున్నారు.
ఢిల్లీ సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో హరీశ్ ఖురానా ఒకరు. తొలి బీజేపీ సీఎం మదన్ లాల్ ఖురానా కుమారుడు. నిన్నటి ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి శివచరణ్‌పై హరీశ్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో పర్వేష్ వర్మ ఒకరు. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకు.
మరొకరు ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరీ స్వరాజ్. ప్రస్తుతం మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి గెలిపొందారు. వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తుల్లో ఈమె కూడా ఒకరు. ఇంకొకరు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఒకరు. పేరుతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా వెనుక నుంచి నడిపించింది బీజేపీ కోర్ టీమ్. ముఖ్యమంత్రి రేసులో ఈయన పేరు బలంగా వినిపిస్తోంది.
మరొకరు మజిందర్ సింగ్ సిర్సా. నిన్నటి ఎన్నికల్లో రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి ధన్వతి చండేలాపై ఆయన విజయం సాధించారు. కాకపోతే ఆయన్ని పక్కన పెట్టాలన్నది బీజేపీ ఆలోచన. ఆయనను పంజాబ్‌కు పంపించాలని భావిస్తోంది. మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరన్నది తేలాలంటే మరో రెండువారాలు వెయిట్ చేయక తప్పదు.