India gas price news: రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారాలకు శుభవార్త.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. కానీ ఇంటి వంటల కోసం ఉపయోగించే గ్యాస్ ధర మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. దీనివల్ల ప్రజల మనసుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. వాణిజ్య రంగానికి మాత్రమే మద్దతా అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే..
జూలై 1న నూతన నెల ప్రారంభమైన నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి. ఈసారి తగ్గుదల ఏకంగా రూ. 58.50. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,665కి చేరింది. ఈ తాజా నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ కార్ట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వాటికి కొంత ఊరటను ఇచ్చేలా ఉంది. వంటకి ఎక్కువగా గ్యాస్ ఉపయోగించే ఈ రంగాలపై ఇప్పటికే ఇంధన ఖర్చులు భారమవుతున్న తరుణంలో ఈ తగ్గింపు వాళ్లకి ఉపశమనం కలిగించవచ్చు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏప్రిల్ నుంచి ప్రతీ నెల కూడా కమర్షియల్ గ్యాస్ ధర తగ్గుతూనే ఉంది. ఏప్రిల్‌లో రూ. 41 తగ్గించగా, మేలో రూ. 14.50 తగ్గించారు. జూన్‌లో మరోసారి రూ. 24 తగ్గించి, ఇప్పుడు జూలైలో మళ్ళీ రూ. 58.50 తగ్గించారు. అంటే నాలుగు నెలల్లో మొత్తం తగ్గుదల రూ.138. ఈ తగ్గింపులు వాణిజ్య రంగంలో పనిచేసే చిన్న వ్యాపారాలకు కొంత ఊపిరి పోసేలా ఉన్నాయి.
ఇంకొకవైపు, గృహ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఊరట లేదు. ఇంట్లో వంట కోసం ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలు మార్చి తర్వాత ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 7న ఒక్కసారి రూ. 50 పెంచిన తర్వాత ఇప్పటి వరకు అదే స్థాయిలో ఉన్నాయి. ఈ ధరలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో రూ. 853, ముంబైలో రూ. 852.50, కోల్‌కతాలో రూ. 879, చెన్నైలో రూ. 868.50, బెంగళూరులో రూ. 805.50. ఈ ధరలు పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలపై గణనీయమైన భారం వేస్తున్నాయి. ఎందుకంటే గ్యాస్ సబ్సిడీ అనే మాట ఇప్పటికి కనిపించదే కనిపించడం లేదు.
దేశంలో ప్రతి నెల మొదటి తేదీన ఎల్పీజీ ధరలు సమీక్ష చేసి నిర్ణయిస్తారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు, డాలర్ మారకం విలువ, రవాణా ఖర్చులు ఇలా అనేక అంశాలపై ఆధారపడి గ్యాస్ ధరలు మారతాయి. అయితే ఇటీవల వాణిజ్య రంగానికి మద్దతుగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నట్లు భావించవచ్చు. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రెస్టారెంట్లు, హోటల్స్, క్యాటరింగ్ సేవలపై ప్రభావాన్ని తగ్గించేందుకు కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించడం జరుగుతోంది. కానీ అదే సమయంలో ఇంటి వినియోగదారులపై ప్రభావం తగ్గించే చర్యలు తీసుకోవడంలో వెనుకబడి ఉన్నట్టు కనిపిస్తోంది.
డిసెంబర్‌లో కమర్షియల్ గ్యాస్ ధర ఒక్కసారిగా రూ. 62 పెరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో కేవలం రూ. 7 మాత్రమే తగ్గించారు. కానీ ఏప్రిల్ నుంచి వరుసగా తగ్గింపులు రావడం చూస్తే, వాణిజ్య గ్యాస్ ధరల్లో సానుకూల మార్పులు జరగడం మొదలైంది. ఈ నిర్ణయాలు దేశ ఆర్థిక పునరుద్ధరణను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవిగా తెలుస్తున్నాయి. సర్వీస్ రంగాలు తిరిగి పుంజుకోవాలంటే ఇంధన ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని వర్గాలకు ఉపయోగపడినా, అన్ని వర్గాలపై మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తే, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ బిజినెస్ చేసే వారికి మాత్రం మేలు జరుగుతోంది. కానీ ఇంటి గ్యాస్ ధర తగ్గకపోవడంతో మధ్య తరగతి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారిలో చాలామందికి ఎప్పుడైనా ధరలు తగ్గుతాయేమో అన్న ఆశ ఉంది. కానీ ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు కనిపించటం లేదు. మళ్ళీ ధరలు పెరగకుండా ఉండటం ఒక వైపు ఊరటగా ఉన్నా, తగ్గితేనే గానీ వాస్తవ లాభం కనిపించదు. గతంలో ప్రజలు పొందుతున్న సబ్సిడీలు కూడా ఇప్పుడు తగ్గిపోవడంతో మరింత భారంగా మారాయి.
మొత్తంగా చూస్తే, కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు వరుసగా నాలుగోసారి తగ్గింపు రావడం అభినందనీయమైన విషయం. కానీ అదే ఊరటను ఇంటి గ్యాస్ వినియోగదారులపైనా చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలు, నిరీక్షణలకు గాను ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు త్వరలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిద్దాం.