Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఢిల్లీ సీఎం పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయి. మిగతా పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే పలు కీలక హామీలను అనౌన్స్ చేసింది. వీటిలో ఎక్కువగా ఉచిత పథకాలే ఉన్నాయి. ఈ హామీలు కచ్చితంగా తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని హస్తం పార్టీ భావిస్తోంది.
ఉచిత విద్యుత్.. 500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇదే ఫార్ములాను ఢిల్లీలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ కిట్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు నెలకు భృతి, ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే ఎల్పీజీ సిలిండర్లు, రేషన్ కిట్లు అందిస్తామన్నారు. ఉచిత రేషన్ కిట్ లో 5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ పొడి, లీటరు వంట నూనె ఉంటాయన్నారు. ఇక ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500 భృతి, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతందరికీ నెలకు రూ.8,500 స్టైఫండ్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేవేందర్ యాదవ్ ఢిల్లీ న్యాయ్ యాత్ర సందర్భంగా ఈ హామీలను ఖరారు చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో 13 నెల్లోనే అన్ని హామీలను నెరవేర్చాం- రేవంత్ రెడ్డి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే కాంగ్రెస్ అన్ని హామీలను నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్, నరేంద్రమోడీ చేసిందేమీ లేదని విమర్శించారు. “ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ను మూడుసార్లు ముఖ్యమంత్రిగా చూశారు. నరేంద్ర మోడీని మూడుసార్లు ప్రధానమంత్రిగా చూశారు. ఉద్యోగాలకల్పన, మౌలిక వసతులు పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో విఫలం అయ్యారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఢిల్లీలో ఈనాడు ఉన్న అన్ని వసతులు కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చినవే” అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తో కలిసి రేవంత్ రెడ్డి ఈ హామీలను ప్రకటించారు.
LIVE: Press briefing by Shri Revanth Reddy, Shri Qazi Nizamuddin and Shri Devender Yadav at DPCC Office, Delhi https://t.co/Iexe0mU7ec
— Delhi Congress (@INCDelhi) January 16, 2025
ఫిబ్రవరి 5న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు
వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఆప్ అధికారింలోకి రాగా, మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ను గద్దె దించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా, 36 స్థానాలు గెలిచిన వాళ్లు సీఎం పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
Read Also: RSS దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్ర విమర్శలు