Jagdeep Resign: కేంద్రంలో ఏం జరుగుతోంది? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఉప రాష్ట్రపతి జగదీప్ ఎందుకు రాజీనామా చేశారు? కేవలం ఆరోగ్య కారణాలా? లేక మరేమైనా ఉన్నాయా? దీనివెనుక లోతైనా కారణాలు ఉన్నాయన్నది కాంగ్రెస్ మాట. ఇంతకీ సోమవారం సాయంత్రం అసలేం జరిగింది? ఇదే చర్చ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. తొలి రోజు కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప ధన్‌ఖఢ్. ఏం జరిగిందో తెలీదుగానీ, గత రాత్రి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాల వల్ల పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడేళ్ల కిందట 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2027 ఆగస్టు వరకు ఆయనకు సమయం ఉంది. ఇలా అర్థాంతరంగా ఆయన వైదొలగడంపై ఢిల్లీ సర్కిల్స్ రకరకాలుగా చర్చ మొదలైంది. ఉన్నట్లుండి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది.
అనారోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ అది కారణం కాదని అనుమానం వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ALSO READ: ఇక స్కూళ్లలో సీసీకెమెరాలు తప్పనిసరి, సీబీఎస్ఈ కీలక ఆదేశాలు
అయితే చర్చ తర్వాత సాయంత్రం నాలుగున్నరకు మళ్లీ సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు నేతలు. అయితే రెండోసారి సమావేశానికి కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా రాలేదు. పరిస్థితి గమనించిన ధన్‌ఖఢ్ అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీంతో ఆ సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
జరిగిన పరిణామాల పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య ఏదో పెద్ద విషయం జరిగిందంటూ ప్రస్తావించారు. రాత్రి ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ప్రకటన చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలని, అందుకు చాలా లోతైన కారణాలు ఉన్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.
రైతుల సంక్షేమంపై ధన్‌ఖఢ్ ఓపెన్‌గా మాట్లాడేవారని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో న్యాయపరమైన జవాబుదారీతనం, సంయమనం గురించి గట్టిగా మాట్లాడేవారని, ఆయన నిబంధనలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉన్నారని ప్రస్తావించారు.