
Udhayanidhi Stalin latest news(Politics news today India):
సనాతన ధర్మంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి బీజేపీని టార్గెట్ చేశారు. కాషాయ పార్టీని విష సర్పంతో పోల్చారు. తాజాగా తమిళనాడు నైవేలీలో డీఎంకే ఎమ్మెల్యే సభా రాజేంద్రన్ నివాసంలో జరిగిన వివాహ వేడుకలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సమయంలో మరోసారి ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీని టార్గెట్ చేసిన ఉదయనిధి.. ప్రతిపక్ష అన్నాడీఎంకేను పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని పేర్కొన్నారు. ఇటీవల డీఎంకే నేత, మాజీ కేంద్రమంత్రి ఎ.రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని మోదీని పాముగా అభివర్ణించారు. ఇప్పుడు ఉదయనిధి బీజేపీని పాముగా పోల్చడంతో వివాదం రేగింది. విష సర్పం ఇంట్లోకి వస్తే తీసి బయట పడేస్తే కుదరదన్నారు. ఆ పాము ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుందని వివరించారు. ఆ చెత్తను తీసేసే వరకు ఆ పాము ఇంట్లోకి వస్తూనే ఉంటుందన్నారు.
తమిళనాడును ఇల్లుగా బీజేపీని విష సర్పంగా ఉదయనిధి అభివర్ణించారు. అన్నాడీఎంకేను ఇంటి వద్ద ఉన్న చెత్తగా పేర్కొన్నారు. చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదన్నారు. బీజేపీ నుంచి విముక్తి పొందాలంటే అన్నాడీఎంకేను తొలగించాలని ఉదయనిధి హాట్ కామెంట్స్ చేశారు.
ఇటీవల సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు పూర్తిగా తొలగించాలని పిలుపునిచ్చారు.ఈ కామెంట్స్ పై రాజకీయ దుమారం రేగింది.