Big Stories

Cop-28 : ‘విపత్తు నిధి’ అమలే కీలకం

Cop-28 : విపత్తు నిధి ఇకనైనా అమల్లోకి వస్తుందా? దుబాయ్‌లో గురువారం నుంచి ఆరంభం కానున్న పర్యావరణ సదస్సు(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-COP28)లో ఈ అంశమే కేంద్ర బిందువు కానుంది. వాతావరణ మార్పుల వల్ల దెబ్బతిన్న పేద దేశాలను ఆదుకునేందుకు ఈ నిధిని ఉద్దేశించారు.

- Advertisement -

‘లాస్ అండ్ డ్యామేజెస్’ అగ్రిమెంట్‌గా పేర్కొంటున్న ఈ ఒప్పందంపై చర్చను 30 ఏళ్లుగా ధనిక దేశాలు ప్రతిఘటిస్తూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిరుడు ఈజిప్టులో జరిగిన కాప్-27లో చారిత్రక ఒప్పందం కుదిరింది. పేద దేశాల కోసం ‘విపత్తు నిధి’ని ఏర్పాటు చేసేందుకు సంపన్న దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు 200 దేశాలు ఒప్పందానికి ఆమోదం తెలిపాయి.

- Advertisement -

గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించే విపత్తులను ఎదుర్కోవడానికి తమకు సహాయం చేయాలని 30 ఏళ్లుగా పేద దేశాలు సంపన్న దేశాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్థిక‌వేత్తల అంచనా ప్రకారం పర్యావరణ మార్పుల ప్రభావం నుంచి పేద దేశాలను ఆదుకునేందుకు ఏటా 1 ట్రిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుంది.

పర్యావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్నదీ తెలుసుకోవడానికి పాకిస్థాన్ చక్కటి ఉదాహరణ. అసలే ఆర్థికంగా చితికిపోయిన పాక్‌ను నిరుడు వరదలు పూర్తిగా ముంచెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల్లో ఆ దేశం వెలువరుస్తున్నది ఒక శాతం కన్నా తక్కువే. అయినా ప్రకృతి విప్తతులు ఏదో ఒక రూపంలో పాక్‌ను దెబ్బతీస్తుండటం పరిపాటిగా మారింది.

కాప్-28 సదస్సులో విపత్తు నిధి కింద ఎంత మొత్తం జమ చేయాలన్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలా సమకూరిన నిధులతోనే వాతావరణ మార్పుల వల్ల దెబ్బతిన్న పేద దేశాలను ఆదుకుంటారు. ఆ నిధి నిర్వహణ బాధ్యతలను ప్రపంచబ్యాంక్ చూస్తుంది. గ్రాంట్ రూపంలో కాకుండా రుణాల రూపేణా పేద దేశాలను ఆదుకోవాలని అది భావిస్తోంది.

మరోవైపు.. నిధి బాధ్యతలను చూసేందుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని గ్లోబల్ సౌత్(వర్థమాన దేశాలు) కోరుకుంటోంది. అయితే దేశాలు ఎంత మొత్తం జమ చేయాలనే అంశంపైనే ఈ సారి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.
లాస్ అండ్ డ్యామేజి ఫండ్ గురించి తొలిసారిగా 2015లో ప్రస్తావనకు వచ్చింది. పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల జరిగే నష్టాలకు పరిహారం అందజేయాలని ధనిక దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.

ఎట్టకేలకు నిరుడు ఈజిప్టులోని షామ్ ఎల్ షేక్‌లో జరిగిన కాప్-27లో నిధి ఏర్పాటైంది. చమురు, గ్యాస్ తదితర శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశలవారీగా తగ్గించుకోవాలన్న భారత్ సూచనకు అమెరికా, యూరోపియన్ దేశాలు అంగీకరించాయి. లాస్ అండ్ డ్యామేజి నిధి ఏర్పాటు చేయడం తప్పనిసరని గ్లోబల్ సౌత్ తరఫున భారత్ గట్టిగా తన వాదనను వినిపించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News