CAG Report – Liquor Policy : దిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టుల కాక మొదలైంది. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తొక్కిపెట్టిన 14 రిపోర్టుల్ని వరుసగా బీజేపీ ప్రభుత్వం సభ ముందుంచుతోంది. అందులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ నివేదికలో మద్యం పాలసీ కుంభకోణం, దాని రూపకల్పనలో భారీ ఆర్థిక అవకతవకలకు దారితీసిందని స్పష్టం చేసింది. ఈ నివేదికలో అప్పటి ప్రభుత్వ విధానాలు, వాటి ద్వారా ఖజానాకు వాటిల్లుతున్న నష్టంపై కాగ్ అనేక వివరాల్ని వెల్లడించింది.
దేశీయంగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న మద్యం విధానంతో దిల్లీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం వచ్చిందని కాగ్ తేల్చింది. అప్పటికే ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన ఆప్ సర్కార్ ధోరణితో.. రాష్ట్ర ఖజానాకు ఏకంగా రూ.2,002 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) నివేదిక స్పష్టం చేసింది.
అవినీతిపై పోరు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్, అతని సహచరుల్లో అనేక మందికి ఈ కేసు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడి, భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యేంద్ర జైన్ సహా.. ఆప్ అగ్ర నేతలంకా జైలు పాలయ్యారు.
వరుసగా మూడేళ్లు దిల్లీ పీఠాన్ని దక్కించుకుని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఇందుకు.. మద్యం కుంభకోణమే ప్రధాన అంశంగా ఆప్ నేతలు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొత్తగా ఎన్నికైన బీజీపీ ప్రభుత్వం కాగ్ నివేదికల్ని శాసన సభ ముందుంచుతోంది. కాగ్ నివేదక ప్రవేశపెట్టే సమయంలో.. ఆప్ ఎమ్మెల్యేలు నిరసనలకు దిగారు. దాంతో.. వారిని సస్పెండే చేసి శాసన సభాపతి.. సభను కొనసాగించారు.
ఇటీవల ఎన్నికల సమయంలోనే కాగ్ రిపోర్టుల్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించిన బీజేపీ.. 2017-18 నుంచి 2020-21 వరకు నాలుగు సంవత్సరాల కాలానికి సంబంధించిన మద్యం విధానంపై CAG నివేదికకు సభ ముందుంచుంది. ఇందులో.. సరెండర్ చేసిన లైసెన్స్‌లను తిరిగి టెండర్లు నిర్వహించకపోవడం వల్ల దిల్లీ ప్రభుత్వం సుమారు రూ.890 కోట్ల ఆదాయ నష్టాన్ని ఎదుర్కొందని వెల్లడించింది, అయితే చర్యలో జాప్యం, జోనల్ లైసెన్స్‌దారులకు మంజూరు చేసిన మినహాయింపుల కారణంగా రూ. 941 కోట్ల విలువైన నష్టాలు సైతం వచ్చినట్లు కాగ్ తప్పుబట్టింది.
వీటితో పాటు అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో.. కోవిడ్-19 పరిస్థితుల్ని కారణంగా చూపించి.. 2021 డిసెంబర్ 28 నుంచి 2022 జనవరి 27 మధ్య కాలానికి లైసెన్స్‌దారులకు రూ.144 కోట్ల మినహాయింపు ఇవ్వడం ఒకటి. ఈ మినహాయింపు ఎక్సైజ్ శాఖ పాలసీలకు విరుద్ధంగా ఉందని, దీనివల్ల మరింత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని CAG గుర్తించింది. అదనంగా, జోనల్ లైసెన్స్ దారులు నుంచి సెక్యూరిటీ డిపాజిట్లను తప్పుగా సేకరించడం వల్ల రూ. 27 కోట్ల లోటు ఏర్పడినట్లు కాగ్ అధికారులు గుర్తించారు.
Also Read : Farmers Used AI: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్య నాదెళ్ల వీడియో రిలీజ్
ఇదే కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత సైతం ఈడీ నుంచి కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఈమె ఇప్పటికే.. దిల్లీ మద్యం కుంభకోణంలో పాల్గొన్నారంటూ జైలుకు సైతం వెళ్లొచ్చారు. దిల్లీలో ఆప్ ఓడిపోవడంతో.. రానున్న రోజుల్లో ఈ కేసులో నిందితులంతా పక్కాగా బుక్ అయ్యే అవకాశాలున్నాయి. దాంతో.. దిల్లీలోని ఆప్ బండారాన్ని బయటపెడుతుంటే.. ఇక్కడి నాయకుల్లో వణుకు పుడుతోందని టాక్.