Republic day 2025 : జనవరి 26 వస్తుందంటే దేశమంతా జెండా పండుగకు సిద్ధమైపోతుంది. స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఓ రకమైన జాతీయ భావంలోకి వెళ్లిపోతుంటారు. ఉదయాన్నే ఉత్సాహంగా నిద్రలేచింది మొదలు.. సాయంత్రం వరకు మన దేశం గొప్పతనం, తమ జాతీయ వీరుల గురించి అనేక కథనాలు వింటూ ఉంటాం. అనేక కార్యక్రమాలు నిర్వహించుకుని సంబురాలు చేసుకుంటారు. మళ్లీ ఆగష్టులో ఇలాంటి వేడులకు సిద్ధమవుతాం. ఆరోజు కూడా ఈ రోజులానే జెండా వందనం చేసి, మిఠాయిలు పంచుకుంటాం. అనేక ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. మరి ఈ రెండు కార్యక్రమాల మధ్య తేడా తెలుసా.. ఏడాదిలో రెండు సార్లు ఎందుకు జెండా వందనం చేస్తారు. రెండు సార్లు స్వాతంత్య్ర వేడుకులు ఎందుకు నిర్వహిస్తారనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా.. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
వేల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న భారత్.. 1757 నాటికి బ్రిటీష్ ఇండియా అనే ఓ వ్యాపార సంస్థ చేతిలోకి వెళ్లింది. క్రమంగా ఆ సంస్థ నుంచి బ్రిటన్ అంటే నేటి లండన్ రాజుల పాలనలోకి వెళ్లిపోయింది మన సువీశాల భారతావని. మన దగ్గర రాజుల మధ్య ఉన్న అనైక్యత, ప్రజల్లో సమష్టితత్వంపై అవగాహన లేకపోవడం సహా మనలో మనమే తగవులు దిగడంతో.. బ్రిటీషర్లు మనల్ని ఏకధాటిగా 200 ఏళ్లు అంటే.. 1757 నుంచి 1947 ఆగష్టు వరకు పరిపాలించారు. అక్కడి నుంచి…
ఇండిపెండెన్స్ డే (Independence Day) : బ్రిటన్ పాలకులకు వ్యతిరేకంగా 1850లో మొదలైన భారత స్వాతంత్ర్య సంగ్రామం.. క్రమంగా పెరుగుతూ బ్రిటీషర్ల చేతి నుంచి విముక్తి సాధించే వరకు సాగింది. అంతకు ముందు 560 కి పైగా చిన్న, పెద్ద రాజ్యాలుగా ఉన్న భూభాగమంతా భారత్ దేశంగా రూపుదిద్దుకుంది. అలా.. బ్రిటన్ పాలకుల నుంచి భారతీయులకు పూర్తి స్థాయి స్వాతంత్ర్యం, అధికారం లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవం- ఇండిపెండెన్స్ డే అంటారు. ఈ కార్యక్రమాన్ని ఆగష్టు 15న నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి బ్రిటీషర్లు పూర్తి అధికారాన్ని మనకు అప్పగించి.. మీ ప్రజల్ని, మీరే పరిపాలించుకొండి అని.. మన భూభాగాన్ని వదిలి వెళ్లిపోయారు.
కోట్ల మంది స్వాతంత్ర్య వీరుల త్యాగాలతో సాధించిన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఏటా గుర్తు చేసుకుంటూ.. ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు.. భారత దేశ ప్రధాని “లాల్ ఖిలా”గా పిలిచే ఎర్రకోట నుంచి జెండా ఎగురవేస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశ ప్రజలు సాధించిన విజయాలు, రానున్న రోజుల్లో దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలపై ప్రధాని ప్రసంగిస్తారు. ఆ రోజు సైనిక దళాల ప్రత్యేక ప్రదర్శనలతో పాటు మన సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తారు. మన ఆయుధాలు, అత్యాధునిక క్షిపణులు వంటి వాటితో పాటు రక్షణ రంగంలోని ఆవిష్కరణలను ప్రదర్శిస్తుంటారు.
అలాగే.. దేశానికి అంతర్జాతీయ వేదికలపై పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన వ్యక్తులతో పాటు దేశంలోని విభిన్న రంగాలకు చెందిన వారిని ఈ వేడుకల్లో భాగస్వాముల్ని చేస్తారు. వారికి బహుమతులు, అవార్డుల్ని ప్రధానం చేస్తారు. ఆరోజు దేశవ్యాప్తంగా పోలీస్, సైనిక కార్యాలయాలతో పాటు పాఠశాల్లో పిల్లల కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి.. వారిలో ఉత్సాహాన్ని నింపుతారు.
రిపబ్లిక్ డే (Republic Day) : ఏటా జనవరి 26న నిర్వహించే కార్యక్రమాల్ని రిపబ్లిక్ డే – గణతంత్ర్య దినోత్సవం అంటారు. అంటే.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. స్వాతంత్ర్యం అందుకున్న తర్వాత మన దేశాన్ని పరిపాలించుకునేందుకు ఓ నిర్దేశిక అవసరం ఏర్పడింది. దాన్ని తయారు చేసుకుని, అమల్లోకి తీసుకువచ్చింది.. 1950 జనవరి 26. 1947 తర్వాత అధికారమంతా మన చేతుల్లోనే ఉన్నా.. దేశంలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, అధికారాల విభజన ఏ తీరుగా ఉండాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అలాగే.. కార్యనిర్వహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను నెలకొల్పడంతో పాటు దేశాన్ని ఏ మార్గంలో నడిపించాలో రాజ్యాంగ నిర్మాతలంతా కలిసి నిర్ణయించి.. అమల్లోకి తీసుకువచ్చిన రోజు జనవరి 26.
ఈ రోజున భారత రాష్ట్రపతి కర్తవ్య పథ్ దగ్గర జాతీయ జెండాను ఎగురవేస్తారు. రాష్ట్రపతి భవన్ కు ఎదురుగా ఉన్న మార్గంలో సైనిక కవాతు నిర్వహిస్తారు. త్రివిధ దళాలు.. భారత రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. ఆ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా దేశానికి సేవల చేసిన పలువురికి అవార్డులు, రివార్డులతో సత్కరించుకుంటారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రముఖులతో పాటు అంతర్జాతీయంగా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరవుతుంటారు.
మనం దేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించాలని నిర్ణయించింది, రాష్ట్రాలు, కేంద్రాలు ఎలా నడుచుకోవాలో, ఎవరికి ఏ అధికారాలు ఉంటాయో స్పష్టంగా విభజించుకుంది 26 జనవరి 1950. అందుకే.. ఏటా జనవరి 26న గణతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. మన దేశాన్ని గణతంత్య్రం రాజ్యంగా మార్చుకుంది ఈ రోజు నుంచే. అందుకే.. ఏటా జెండాను ఆవిష్కరించుకుని, జాతీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. గణతంత్ర్యం అంటే.. ప్రజల్ని పరిపాలించే అధికారం రాజ్యాలు, రాజులు, వారసత్వం వంటి విధానాల నుంచి తీసివేసి.. ప్రజలే వారిని ఎవరు పరిపాలించాలని నిర్ణయించుకునే హక్కు.
Also Read : రిపబ్లిక్ డే సందర్భంగా మీకోసం మంచి కొటేషన్లు.. ఇదిగో చూడండి..
మన దేశంలో గ్రామ సర్పంచి నుంచి దేశ ప్రధాని వరకు ప్రజలు ఎంచుకున్న వారే అధికారంలో ఉంటారు. వారు వద్దనుకున్న వారు అధికారానికి దూరంగా ఉండాల్సిందే. అలాంటి.. శక్తివంతమైన అధికారాన్ని దేశ ప్రజలకు కల్పించి.. సరికొత్త స్వేచ్ఛను ప్రసాదించిన రోజు కావడంతో.. ఏటా జనవరి 26న గణతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.