Emotional Cruelty Divorce| విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు, అందులోని సెక్షన్ల ఆధారంగా నడుచుకోవాలి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు, ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా బాంబే హైకోర్టు విడాకులకు సంబంధించిన ఓ సంచలన తీర్పు వెల్లడించింది.
జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపుల చేసినా, లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా, అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.
తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని, తనను, తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆ మహిళతో కలిసి కాపురం చేయలేనని, తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టులో కేసు వేశాడు. ఫ్యామిలీ కోర్టులో అతనికి ఊరట దక్కగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది.
ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు, బలవన్మరణానికి పాల్పడతానని కూడా చెబుతోంది. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే, అది అవతలి వారిని హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ న్యాయమూర్తి ఆర్.ఎం.జోషి తీర్పు వెల్లడించారు.
Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త, అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పిల్లవాడు కూడా ఉన్నాడు. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు అతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి తిరిగి రాలేదని ఆయన తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని, ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు ద్వారా కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. కానీ భార్య.. ఫ్యామిలీ కోర్టు తీర్పును హై కోర్టులో సవాల్ చేయగా, బాంబే హైకోర్టు.. కింది కోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.