Covid Patient| 2021లో కరోనా (కోవిడ్-19) మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన సమయంలో మహారాష్ట్రలోని లాతూర్‌లో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియో క్లిప్ సంభాషణ వివాదాస్పదంగా మారింది. ఈ ఆడియోలో ఉద్గీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు జిల్లా సర్జన్‌గా పనిచేసిన డాక్టర్ శశికాంత్ దేశ్‌పాండే, కోవిడ్ కేర్ సెంటర్‌లో పనిచేసిన డాక్టర్ శశికాంత్ దంగే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆడియో క్లిప్‌లో ఒక డాక్టర్ మాట్లాడుతూ.. “ఎవరినీ లోపలికి రానివ్వకు, ఆ దయామిని ప్రాణాలతో ఉంచకూడదు. ఆ దయామికి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తున్నారు” అని చెప్పినట్లు వినిపిస్తుంది. ఈ మాటలు ఒక కోవిడ్ రోగికి సంబంధించినవని, ఆసుపత్రిలో బెడ్ల కొరత ఉన్న సమయంలో ఆక్సిజన్ తగ్గించాలని లేదా రోగిని తొలగించాలని సూచించినట్లు అనిపిస్తోంది.
ఆడియో క్లిప్ ఉద్దేశించిన ఈ రోగి 2021 ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ఉద్గీర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతూ చేరారు. ఈ ఆడియో క్లిప్ పై స్పందించిన సదరు కరోనా బాధితురాలి భర్త మాట్లాడుతూ.. ఆమె తర్వాత కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్పారు. కానీ, 2021లో డాక్టర్ దంగే పక్కన కూర్చున్నప్పుడు ఈ సంభాషణ విన్న ఆమె భర్త, ఈ ఆడియో మళ్లీ ఈ ఏడాది మే 2న వైరల్ కావడంతో విని మానసికంగా కలత చెందారు. ఈ ఆడియోలో కుల వివక్షతో కూడిన మాటలు ఉన్నాయని, అది తన మత భావనలను గాయపరిచిందని ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ ఆడియో క్లిప్ బయటికి రావడంతో.. మే 24న డాక్టర్ దేశ్‌పాండేపై ఉద్గీర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 119, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు నేరం దాచడం, మత భావనలను గాయపరిచే చర్యలకు సంబంధించినవి. ఇద్దరు డాక్టర్లకు నోటీసులు జారీ చేశామని, దేశ్‌పాండే ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆయన వాంగ్మూలం నమోదు చేశామని పోలీస్ ఇన్‌స్పెక్టర్ దిలీప్ గాడే తెలిపారు. డాక్టర్ దంగే ప్రస్తుతం జిల్లాలో లేరని, త్వరలో విచారణకు హాజరైతే ఆయన ఫోన్‌ను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ఆడియో నిజమైనదా కాదా అని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Also Read: రూ.500 నోట్ల కట్టలను కిటికీ నుంచి విసిరేశాడు.. కట్ చేస్తే.. కట్‌కటాల్లోకి!
మహారాష్ట్రలో కరోనాతో ఒక వ్యక్తి మృతి
అయితే తాజాగా శుక్రవారం మే 30 2025 రాత్రి.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 43 ఏళ్ల వినీత్ కినీ అనే వ్యక్తి కోవిడ్-19 సోకి మరణించారు. ఆయన నైగావ్ సమీపంలోని ఖోచివ్డే గ్రామానికి చెందినవారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో వసైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ న్యుమోనియా ఉన్నట్లు తెలిసింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని రహేజా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
శుక్రవారం రాత్రి చికిత్స సమయంలో ఆయన మరణించారు. న్యుమోనియా, శ్వాస సమస్యల కారణంగా ఆయన మరణించారని, ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా నేరుగా పచుబుందర్‌లోని శ్మశానవాటికకు తీసుకెళ్లి దహనం చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ పవార్ చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ భక్తి చౌదరి ప్రజలను కోరారు. వినీత్ మరణంతో ఆయన గ్రామంలో ప్రజలు భయందోళనలో ఉన్నారు. మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.