Dowry Protest Tea Stall| రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ఒక చిన్న టీ కొట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కృష్ణకుమార్ ధాకడ్ అనే వ్యక్తి ఈ కొట్టులో చేతులకు సంకెళ్లు తొడుక్కుని అందరికీ చాయ్ పోస్తున్నాడు. ఇలా అతను ప్రజలను ఆకర్షించడానికి చేయడం లేదు. తన జీవితాన్ని నాశనం చేసిన కేసులకు నిరసనగా.. తన టీ కొట్టు పేరును “498A టీ కేఫ్” అని పెట్టాడు. ఇది భారతీయ శిక్షాస్మృతిలోని 498A సెక్షన్‌ను సూచిస్తుంది. ఈ చట్ట ప్రకారమే.. కృష్ణకుమార్ భార్య అతనిపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది.
కొట్టు చుట్టూ బ్యానర్లలో నిరసనలతో కూడిన నినాదాలు, మెసేజ్‌లు ఇస్తున్నాయి. “న్యాయం దొరికేవరకు చాయ్ మరుగుతూనే ఉంటుంది”, “రండి, చాయ్ తాగుతూ 125 సెక్షన్ ప్రకారం ఎంత ఖర్చులు ఇవ్వాలో మాట్లాడుదాం” వంటి నినాదాలు అతని న్యాయ పోరాటాన్ని గుర్తుచేస్తున్నాయి. ఈ సెక్షన్లు వరకట్న వేధింపులు (498A), భరణం (125) గురించి వివరిస్తాయి.
కృష్ణకుమార్ జీవిత కథ సంతోషంగా ప్రారంభమైంది. 2018లో మీనాక్షి మాలవ్‌ను అతను పెళ్లిచేసుకున్నాడు. వారిద్దరూ కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారం ప్రారంభించారు. ఈ వ్యాపారం స్థానిక మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2021లో అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. కానీ, 2022లో వారి దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి. మీనాక్షి ఇంటిని విడిచి వెళ్లిపోయి, కృష్ణపై వరకట్న వేధింపులు, ఆర్థిక దోపిడీ ఆరోపణలతో కేసులు పెట్టింది. అప్పటి నుంచి కృష్ణకు కోర్టు చుట్టూ తిరగడం, తన వృద్ధ తల్లిని చూసుకోవడం, నీముచ్‌లోని అథానా నుంచి 220 కిలోమీటర్లు ప్రయాణించి అంటాలోని కోర్టుకు వెళ్లడం వంటి కష్టాలు ఎదురయ్యాయి.
“కోర్టుకు వెళ్తే తేదీల మీద తేదీలు ఇస్తున్నారు. న్యాయం ఎక్కడా కనిపించడం లేదు” అని కృష్ణ మీడియాతో చెప్పాడు. ఈ కష్టాల మధ్య, అతను తన అత్తగారి ఇంటి ముందు “498A టీ కేఫ్” పెట్టి నిరసన చేయాలని నిర్ణయించాడు. తన బాధను నిరసనగా మార్చాడు.
కృష్ణ తాను నిర్దోషినని, తన భార్య చట్టాన్ని దుర్వినియోగం చేసిందని చెబుతున్నాడు. కానీ, మీనాక్షి మాత్రం వేరే కథ చెబుతోంది. “అతను నా తండ్రి నుంచి భూమి కొనడానికి డబ్బు డిమాండ్ చేశాడు. మేము నిరాకరించినప్పుడు నన్ను కొట్టాడు. అందుకే నా తండ్రి ఇంటికి వచ్చేశాను. నా పేరిట తీసిన రుణాలు తీర్చిన తర్వాతే విడాకులు ఇస్తాను” అని ఆమె మీడియాతో చెప్పింది.
Also Read: కస్టమర్లకు ఫైన్ వేసే రెస్టారెంట్.. చిన్న తప్పు చేసినా రూ.1500 చెల్లించాల్సిందే
ఈ దంపతుల వివాదం భారతదేశంలో వరకట్న చట్టాల దుర్వినియోగం, నిజమైన బాధితుల రక్షణ, తప్పుడు ఆరోపణల నివారణ గురించిన చర్చను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం, కృష్ణ “498A టి కఫే” లో చాయ్ అమ్ముతూ, తన నిరసనను కొనసాగిస్తున్నాడు. ప్రతి కప్పు చాయ్‌తో అతని నిరాశ, ఓర్పు, న్యాయం కోసం అతని పోరాటం బయటపడుతోంది. కృష్ణ లాంటి చాలా మంది యువకులు వరకట్న వేధింపుల కేసులో చిక్కుకొని దేశంలోని న్యాయవ్యవస్థ పురుషుల పట్ల వివక్ష చూపేవిధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా అమాయకులను కాపాడే విధంగా ఉండాలని నిరసనలు చేస్తున్నారు.