Restaurant Fine Customer| కస్టమర్ ఈజ్ గాడ్ అనే సామెత ఇంగ్లీషు భాషలో ఉంది. దీని అర్థం.. వ్యాపారంలో కస్టమర్ ను భగవంతుడితో సమానంగా చూడాలి. అతనికి సపర మర్యాదలన్నీ చేసి సంతోషంగా చూసుకోవాలి. ఇది నిజం కూడా. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉంటేనే కదా బిజినెస్ లో లాభాలు వచ్చేది. కానీ ఒక రెస్టారెంట్ మాత్రం ఇందుకు భిన్నంగా కస్టమర్లకు ఫైన్ విధిస్తోంది. ఈ విధంగా నిబంధనలు రూపొందించి వాటిని అమలు కూడా చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ దేశంలోని అంబోయిస్ పట్టణంలో ఉన్న లిలోట్ అనే ఒక చిన్న రెస్టారెంట్ కొత్త నిబంధనతో వివాదంలో చిక్కుకుంది. కేవలం 20 సీట్లున్న ఈ రెస్టారెంట్ లో యజమాని, చెఫ్ అయిన ఒలివియర్ విన్సెంట్ ఒక కఠిన నిబంధన ప్రవేశపెట్టారు. రిజర్వేషన్‌లో చెప్పిన సంఖ్య కంటే తక్కువ లేదా అధిక సంఖ్యలో అతిథులు వస్తే.. ఒక్కొక్కరికి 15 యూరోల (సుమారు రూ. 1500) జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ నిబంధన రెస్టారెంట్ నిర్వహణలో కస్టమర్లను మరింత బాధ్యతాయుతంగా.. గౌరవంగా ఉండేలా చేయడానికి అని ఆయన చెప్పారు.
ఈ నిర్ణయం వెనుక కారణాన్ని విన్సెంట్ వివరిస్తూ.. కస్టమర్లు రిజర్వేషన్ చేసుకున్న సంఖ్యలో రాకపోవడం లేదా అనుకోకుండా ఎక్కువ మంది రావడం వల్ల రెస్టారెంట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ సమస్య “ప్రతి వారం” ఎదురవుతోందని.. అందుకే ఈ కొత్త నియమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన ఫేస్‌బుక్ లో చేసిన ఓ పోస్ట్‌లో తెలిపారు.
ఫేస్‌బుక్‌లో విన్సెంట్ ఈ నిబంధన గురించి ఇలా రాశారు. “లిలోట్ రెస్టారెంట్ ఒక మార్పును ప్రకటిస్తోంది. ఇక నుంచి, మీరు రిజర్వేషన్ చేసిన అతిథుల సంఖ్యకు భిన్నంగా వస్తే.. ఒక్కొక్కరికి 15 యూరోలు చెల్లించాలి. తక్కువైనా, ఎక్కువైనా. మీ అవగాహనకు ధన్యవాదాలు.” పోస్ట్ క్యాప్షన్‌లో.. “ముందస్తు హెచ్చరిక లేకుండా…” అని రాశారు.
డైలీ మెయిల్‌తో మాట్లాడిన విన్సెంట్.. కస్టమర్లు రెస్టారెంట్‌కు రాకముందు అతిథుల సంఖ్యలో మార్పు ఉంటే ఫోన్ చేసి తెలియజేస్తే ఈ జరిమానాను సులభంగా నివారించవచ్చని.. కనీసం అందరి వద్ద ఫోన్లు ఉంటాయి కదా అని చెప్పారు.
ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌పై వందలాది మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు ఈ నిబంధనను సమర్థిస్తూ.. రెస్టారెంట్ నిర్ణయం సరైనదని చెప్పారు. అయితే, మరికొందరు ఈ జరిమానా సమస్యాత్మకమని, అత్యవసర పరిస్థితులను దీనిలో పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు.
ఒక వ్యాఖ్యాత అయిన ఆరెలీ సివ్రాయిస్ ఇలా రాశారు. “మీ సందేశం వెనుక ఉన్న ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ ఈ విధానం సరైనది కాకపోవచ్చు. అత్యవసర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నిబంధన మీ రెస్టారెంట్‌కు మంచి పేరు తీసుకురాదు. కొందరు దుర్వినియోగం చేయడం నిజమే, కానీ ఈ రూల్ కాస్త కఠినంగా ఉంది. ఒక ఎమర్జెన్సీ డాక్టర్ తన కుటుంబంతో భోజనానికి రాలేకపోయినా లేదా ఎవరికైనా కుటుంబ ఎమర్జెన్సీ వచ్చినా ఈ జరిమానా విధించడం సరికాదు.”
Also Read: ఫ్రీగా 120 విమాన ప్రయాణాలు.. ఎయిర్‌లైన్స్‌ను 6 ఏళ్ల పాటు చేసిన వ్యక్తి అరెస్ట్
ఈ నిబంధన రెస్టారెంట్ నిర్వహణలో క్రమశిక్షణను తీసుకురావడానికి ఉద్దేశించినప్పటికీ.. అత్యవసర పరిస్థితులను ఎలా నిర్వహిస్తారనే దానిపై స్పష్టత అవసరం. కస్టమర్లు ముందస్తు సమాచారం ఇస్తే జరిమానా నివారించవచ్చని యజమాని చెప్పినప్పటికీ, ఈ నియమం రెస్టారెంట్‌కు మంచి, చెడు రెండు రకాల స్పందనలను తెచ్చిపెట్టింది.