EC Responds Rahul Gandhi Maharashtra| మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) శుక్రవారం సాయంత్రం స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తే ప్రశ్నలు, వారు చేసే సూచనలను తాము గౌరవిస్తున్నామని, త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి వివరాలు, విధానపరమైన అంశాలను తాము స్పష్టం చేస్తామని కమిషన్ తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 7న ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈసీ ప్రకటనకు ముందు.. రాహుల్ గాంధీ ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ స్థాయిలో అవతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఉన్న జనాభా కంటే ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ఓట్లు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలో జరిగిన లోక సభ ఎన్నికలకు, ఆ తరువాత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కొత్తగా 35 లక్షల మంది ఓటర్లు ఎలా చేరారని రాహుల్ ప్రశ్నించారు. అంటే కేవలం అయిదు నెలల వ్యవధిలోనే 35 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలోకి రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని తాము సీరయస్ గా పరిగణిస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్షాలకు చెందిన పార్టీలు కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని.. మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై అధ్యయనం చేస్తున్నామని రాహుల్ తెలిపారు. బలహీన వర్గాలకు చెందిన అనేక మంది ప్రజల ఓటరు హక్కులను జాబితా నుంచి తొలగించారని, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్లు ఉన్నప్పటికీ అక్కడి ఓటర్లను మరో పోలింగ్ బూత్‌కు మార్చారని ఆయన ఎన్నికల సంఘం తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా.. ఎమ్మెల్యే కొనుగోలు ఆరోపణలపై కేజ్రీవాల్‌కు నోటీసులు
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను తమకు అందించాలని ఎన్నికల సంఘాన్ని కోరామని రాహుల్ గాంధీ తెలిపారు. దీని ద్వారా కొత్తగా చేరిన ఓటర్లు ఎవరనే విషయంలో స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా, ఎంత మంది ఓటర్లను తొలగించారు, ఒక బూత్ నుంచి మరొక బూత్‌కు ఓటర్లను ఎందుకు బదిలీ చేశారు అనే విషయాలు కూడా తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అవతవకలు జరిగినందునే, ఓటర్ల జాబితాను తమకు అందించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రాలేకపోతోందని ఆయన ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పూర్తి డేటాను ఎన్నికల సంఘం దాస్తోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరపణలు చేశారు. బూత్ వైజ్ ఓటర్ల డేటాను ఎన్నికల తరువాత ఎన్నికల సంఘం ఎందుకు బహిర్గం చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో పారదర్శకత కోసం ఎన్నికల సంఘం ఆన్ లైన్ ఈ వివరాలు ఉన్న ఫామ్ 17 సి అప్ లోడ్ చేయాల్సి ఉండగా.. ఆ పని ఇప్పటివరకు చేయకుండా ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.